Vijayashanthi : హిందీ భాషా వివాదం.. విజయ్ సేతుపతికి విజయశాంతి సపోర్ట్.. ఏమన్నారంటే..

Vijayashanthi : ‘‘ఓ భాషగా హిందీని తమిళనాడులో ఎవరూ వ్యతిరేకించడం లేదు.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 02:03 PM IST

Vijayashanthi : ‘‘ఓ భాషగా హిందీని తమిళనాడులో ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే మా వ్యతిరేకత. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. తమిళనాడులోనూ అనేక మంది ఇప్పటికే హిందీ నేర్చుకుంటున్నారు. మీది అనవసరమైన ప్రశ్న’’ అంటూ ఓ విలేకరిపై తమిళ హీరో విజయ్ సేతుపతి ఫైర్ అయ్యారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా మెర్రీ క్రిస్మస్ సినిమా రూపొందింది. జనవరి 12న ఇది దేశవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 7న చెన్నైలో ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాదిలో హిందీ భాష స్థితిపై  విజయ్ సేతుపతికి  ఓ విలేకరి  ప్రశ్నలు సంధించారు. వాటిపై ఘాటుగా స్పందిస్తూ విజయ్ సేతుపతి పై విధమైన కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు.  ‘‘తమిళనాట హిందీ చదువుకోకూడదని మేం ఎవరికీ చెప్పట్లేదు.. కానీ మా నెత్తిన బలవంతంగా రుద్దకూడదని తెలియజేస్తున్నాం అని సాటి కళాకారుడు విజయ్ సేతుపతి చేసిన ప్రకటన సమర్థనీయం. అది సమంజసమైన అభిప్రాయమే.  ద్రవిడ, దక్షిణాది భావోద్వేగాలను అందరూ గౌరవించాలి. జాతీయ స్థాయిలో కూడా దక్షిణ భారతదేశ భావాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది’’ అని విజయశాంతి తన పోస్టులో అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 7న చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో విజయ్‌ సేతుపతి(Vijayashanthi) ఇంకా మాట్లాడుతూ.. ‘‘నేను కొన్నేళ్లు దుబాయిలో పని చేయడం వల్ల హిందీ భాష తెలుసు. అది ఈ మూవీకి బాగా హెల్ప్‌ అయ్యింది’’ అని తెలిపారు.  ఇక కత్రినా కైఫ్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు చైన్నె అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా కొంత కాలం మధురైలోని ఒక పాఠశాలలో పనిచేశారు.నేను ఇప్పటికే దక్షిణాదిలో తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించాను. ఇప్పుడు తొలిసారిగా మెర్రీ క్రిస్మస్‌ ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాను’’ అని చెప్పారు.  బద్లాపూర్‌, అంధదూన్‌ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్‌ రాఘవన్‌ మెర్రీ క్రిస్మస్ సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఇది సినీ పరిశ్రమ అంచనాలను అందుకుంటుందా లేదా వేచిచూడాలి.

Also Read: 2024 – Career Options : 2024లో మీ జీవితం మార్చే టాప్-5 కెరీర్ ఆప్షన్స్