Site icon HashtagU Telugu

Karnataka Hijab Row: హిజాబ్ ర‌గ‌డ‌.. విద్యార్ధినుల‌కు లెస‌న్స్ చెప్ప‌కుండా, స‌ప‌రేట్‌గా కూర్చోబెట్టారు

Hijab

Hijab

కర్ణాటకలో హిజాబ్ (స్కార్ఫ్‌) గొడవ, క్ర‌మ క్ర‌మంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. క‌న్న‌డ‌నాట‌ హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతున్న నేప‌ధ్యంలో అక్క‌డి కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక‌వైపు క‌ర్నాట‌క విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు త‌ప్ప‌కు పాటించాల‌ని, అధికార బీజేపీ పార్టీ అంటుంటే, మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం హిజాబ్‌కు మద్దతు తెలుపుతోంది. ఇక క‌ర్నాట‌క‌లోని కొన్ని ప్రాతాల్లో ఉన్న‌ కాలేజీల్లో హిజాబ్‌ ధరించిన బాలికలను, క‌ళాశాల‌లోకి అనుమతించపోవడంతో మొద‌లైన ఈ ర‌గ‌డ రోజు రోజుకీ మ‌లుపులు తిరుతుతోంది. హిజాబ్‌ ధరించిన స్టూడెంట్స్‌కు పోటీగా కొంద‌రు విద్యార్ధులు కాషాయ శాలువాతో క్లాసుల‌కు రావ‌డంతో వివాద మ‌రింత ముదిరింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్‌తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో ఈ గొడ‌వ మొదలైంది. ఆ త‌ర్వాత కుందాపూర్, బైందూర్‌తో పాటు బెల్గావీ, హసన్, చిక్‌మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు ప్రాంతాల‌కు ఈ వివాద విస్తరించింది.

ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు హిజాబ్‌ తమ హక్కు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తుండ‌గా, వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెల్పుతూ, నిర‌స‌న‌లు జ‌రిగే పలుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇదే క్ర‌మంలో కాళాశాలల్లో హిజాబ్‌ను అనుమతించాలన్న డిమాండ్‌కు, కాంగ్రెస్ ముఖ్య‌నేత రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. ఈ క్ర‌మంలో హిజాబ్ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, చదువుల తల్లి సరస్వతి, తన బిడ్డలకు ఎలాంటి తేడా చూపద‌ని, జ్ఞానాన్ని అందరికీ పంచుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అక్క‌డి కాలేజీలో దాదాపు వెయ్యి మంది విద్యార్థినులు, చదువుకుంటున్నారు. వారిలో 75 మంది ముస్లింలు ఉన్నారు. అయితే ఆరుగురు విద్యార్థులు మినహా మిగిలిన మెజారిటీ ముస్లిం బాలికలకు, మా కాలేజ్ నిబంధనలతో ఎలాంటి సమస్య లేద‌ని ఉడిపి కళాశాల ప్రిన్సిపాల్ రుద్రెగౌడ తెలిపారు. విద్యార్ధినులు హిజాబ్ ధరించి క్యాంపస్‌లో తిరగడానికి అనుమతించామ‌ని, క్లాసులో మాత్రమే హిజాబ్ ధరించరాదనే నిబంధన పెట్టామ‌ని, అయితే స‌ద‌రు విద్యార్ధినులు మాత్రం క్లాస్‌లో తాము హిజాబ్‌ను తొలగించబోమని పట్టు బ‌ట్టారు.

ఈ నేప‌ధ్యంలో ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ పియు కళాశాల క్యాంపస్‌లోకి విద్యార్ధిలను అనుమతించింది, అయితే వారికి పాఠాలు చెప్పకుండా ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. కుందాపూర్‌లోని కలవర వరదరాజ్ ఎం శెట్టి ప్రభుత్వ ప్రథమ శ్రేణి కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థులను ఇంటికి పంపించారు. హిజాబ్ లేకుండా త‌ర‌గ‌తుల‌కు వెళ్ళాల‌ని స‌ల‌హా ఇవ్వ‌గా, వారు నిరాక‌రించార‌ని, దీంతో కోర్టు ఉత్త‌ర్వ్యుల కోసం వెయిట్ చేయాల‌ని విద్యార్ధుల‌ను అభ్య‌ర్ధించామ‌ని వైస్ ప్రిన్సిపాల్ ఉషా దేవి అన్నారు. ఇక మ‌రోవైపు కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని మరో రెండు కళాశాలలు, శాంతేశ్వర పియు మరియు జిఆర్‌బి కళాశాలలో, హిజాబ్ ధరించిన విద్యార్ధుల‌కు వ్యతిరేకంగా, కొంద‌రు విద్యార్ధులు కాషాయ కండువాలు ధరించి నిర‌స‌న తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ప్రిన్సిపల్ కర్నాటక హైకోర్టులో ఈ కేసుపై రేపు విచారణ జరుపుతుందని విద్యార్థులకు చెప్పి, కాళాశాల‌కు సెలవు ప్రకటించారు. హిజాబ్ ఆంక్షలను ప్రశ్నిస్తూ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించనుంది.

ఇక రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ప్రయత్నిస్తున్నాయని ప్ర‌ధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. హిజాబ్ ధరించిన విద్యార్ధినులను పాఠశాలలో ప్రవేశించకుండా నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. హిజాబ్‌ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమేన‌ని, కాషాయ ద‌ళం ఎజెండా అని సిద్దారామ‌య్య ఆరోపించారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను ప్రభుత్వం అనుమతించబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ అన్నారు. క‌ర్నాట‌క‌లో బీజేపీ స‌ర్కార్ ఉంద‌ని, దీంతో క‌ళాశాలల్లో హిజాబ్ లేదా ఇతర మత‌ సంబంధిత సంఘటనలకు ఆస్కారం లేద‌న్నారు. పాఠశాలలు తల్లి సరస్వతి దేవి ఆలయాలని, దీంతోత ఒక్కరూ అక్కడ నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. క‌ళాశాల‌ల్లో మతాన్ని తీసుకురావడం సరికాదని, విద్యార్థులకు కావాల్సింది విద్య మాత్రమే అని, ఎవరైనా నిబంధనలను పాటించలేకపోతే వారు వేరే చోట తమ మార్గాన్ని ఎంచుకోవచ్చని గ‌త వార‌మే న‌ళిన్ కుమార్ చెప్పారు.

Exit mobile version