Site icon HashtagU Telugu

Hijab : హిజాబ్‌పై కొన‌సాగుతున్న ర‌గ‌డ‌.. పరీక్షల సమయంలో హిజాబ్‌కు అనుమతి లేదన్న‌ కర్ణాటక మంత్రి

Karnataka Hijab Row

Karnataka Hijab Row

కర్ణాటకలో హిజాబ్‌పై ర‌గ‌డ కొన‌సాగుతుంది. హిజాబ్ ధరించిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ మంత్రి బి.సి.న‌గేష్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మార్చి 9 నుంచి II పీయూసీ (12వ తరగతి) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులందరూ యూనిఫాం ధరించి పరీక్షలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.హిజాబ్ ధరించి పరీక్షలు రాయాలనుకునే వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఆయన తెలిపారు. హిజాబ్ నిషేధం తర్వాత పరీక్షలకు హాజరయ్యే ముస్లిం విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి నగేష్ పేర్కొన్నారు.సుప్రీంకోర్టులో ఉన్న హిజాబ్ కేసు హోలీ సెలవుల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. హిజాబ్ ధరించి పరీక్షలు రాసేందుకు అనుమతి లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదు. కర్నాటక ప్రభుత్వ పాఠశాలల్లో హిజాబ్ ధరించి పరీక్షలు రాయాలన్న ముస్లిం బాలికల అభ్యర్థనను విచారించేందుకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. పరీక్షలు జరుగుతున్నందున బాలికలు మరో విద్యాసంవత్సరం నష్టపోయే దశలో ఉన్నారని ఒక మహిళా న్యాయవాది పిటిషన్‌పై అత్యవసర విచారణను కోరగా, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలతో కూడిన ధర్మాసనం బెంచ్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపింది.