Site icon HashtagU Telugu

Karnataka Hijab Row: మంగళూరులో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య హిజాబ్ ర‌గ‌డ‌..!

Karnataka Hijab Row

Karnataka Hijab Row

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం మ‌ళ్ళీ తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని, పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్ గొడ‌వ చెల‌రేగింది. క‌ర్నాట‌క‌లో ఇప్పటికే హిజాబ్​ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా, కొంద‌రు విద్యార్థినులు హిజాబ్​ ధరించినప్పుడు పెట్టుకునే పిన్​ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూసిన ఓ వర్గం విద్యార్థులు వారిని బయటికి పంపాలని సిబ్బందిని కోరారు.

దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రం బయట నిరసన చేపట్టారు. ఈ క్ర‌మంలో ఆ కాలేజ్‌లో ఇరు వర్గాల విద్యార్ధుల‌ మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం కళాశాల ప్రవేశద్వారం వద్ద విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కళాశాలల్లోకి విద్యార్థులు తలకు గుడ్డ కట్టుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రిన్సిప‌ల్స్ అనుమతించారు. అయితే విద్యార్థులు హిజాబ్‌ను పోలి ఉండే గుడ్డపై పిన్‌లను ఉపయోగించవద్దని చెప్పారు.

ఇక గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైన సంగ‌తి తెలిసిందే. ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాలలో హిజాబ్ ధరించిన కొందరు మహిళలను, ఆ కాలేజ్ యాజమాన్యం లోపలికి అనుమతించక‌పోవ‌డంతో ఈ హిజాబ్ వివాదం తొలిసారి తెర‌పైకి వ‌చ్చింది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి.ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు అక్క‌డి ప్ర‌భుత్వం కొద్ది రోజులు సెల‌వులు ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే ప్ర‌స్తుతం ఈ హిజాబ్ వ్యవహారంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.