Beast movie: తమిళనాడులో బీస్ట్ టికెట్ల వివాదం

విజయ్ నటించిన బీస్ట్ సినిమా టిక్కెట్‌ల రేట్ల వివాదం తమిళనాడులో అలజడి రేపింది.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 05:54 PM IST

విజయ్ నటించిన బీస్ట్ సినిమా టిక్కెట్‌ల రేట్ల వివాదం తమిళనాడులో అలజడి రేపింది. పుదువై లో ఈ సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు థియేటర్ యాజమాన్యాలు కూడా కొత్త రేట్లతో కూడిన బోర్డులు తయారుచేయడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. అసలే వివిధ రకాల వస్తుసేవల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని.. అలాంటిది టిక్కెట్ రేట్లు కూడా పెంచి తమకు వినోదాన్నీ దూరం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. దీని టిక్కెట్ ధరలను థర్డ్ క్లాస్ కు రూ.50 నుంచి రూ.150 లకు.. సెకండ్ క్లాస్ టిక్కెట్ల ధరను రూ.75 నుంచి రూ.175కు, ఫస్ట్‌ క్లాస్‌ టిక్కెట్ రేటును రూ.100 నుంచి రూ.200కు, బాల్కానీ క్లాస్ టిక్కెట్ ధరను రూ.150 నుంచి రూ.250కు, బాక్స్‌ రేటును మాత్రం రూ.160 నుంచి రూ.260కు పెంచినట్లు బోర్డులు తయారైపోయాయి. ఇది తెలియడంతో ప్రేక్షకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

ఇలాంటి సమయంలో తమిళనాడులో కూడా దీనిని ఎవరూ చూడకుండా చేస్తారా అంటూ ప్రేక్షకులు ఆగ్రహించారు. దీంతో అక్కడి కలెక్టర్ కార్యాలయ వర్గాలు మాత్రం దీనిని ఖండించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు వివిధ ప్రాంతాల్లో చుక్కెదురవుతోంది. కువైట్ లో దీని ప్రదర్శనను నిషేధించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని పరిస్థితి ఎలా ఉన్నా.. విజయ్ నటించిన సినిమాలు ఈమధ్యకాలంలో రూ.100 కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. దీంతో బీస్ట్ కూడా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.