Chennai : తమిళనాడును వీడిన భారీ వర్షాలు..విద్యాసంస్థలకు నేడు సెలవు..!!

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 06:18 AM IST

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో పరిస్ధితి అధ్వాన్యంగా మారింది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో చెన్నై పూర్తిగా జలదిగ్భందం అయ్యింది.

సాయంత్రం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. కొంతమంది ప్రయాణీకులు వాహనాలను వదిలేసి నీళ్లల్లోనే ఇళ్లలోకి పరుగులు తీశారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ వారంతరం వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కూడా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కాగా ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. 16 పశువులు మృత్యువాత పడగా…52గుడిసెలు,ఇళ్లు నేలమట్టమయ్యాయి. 15 ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వరదల పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం 37మంది అధికారులను నియమించింది.