Site icon HashtagU Telugu

Madras High Court: పోలీసులు బానిసలు కాదు.. ఆర్డర్లీ వ్యవస్థపై మద్రాస్ హైకోర్టు..

Madras Court Imresizer

Madras Court Imresizer

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్డర్లీ వ్యవస్థ కొత్త కాదు, వింత కాదు. కానీ అదే సమయంలో అది అధికారికం కూడా కాదు. ఉన్నతాధికారులు తమ ఇంటి పని, వంటపని, ఇతరత్రా పనులన్నీ కిందిస్థాయి సిబ్బందితో చేయించుకుంటారు. కానీ వారికి జీతం ఇచ్చేది మాత్రం ప్రభుత్వమే. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంప్రదాయం ఉంది. దీన్ని రద్దు చేస్తున్నామంటూ ఎన్నిసార్లు ఎంతమంది ఉన్నతాధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చినా అది అమలవుతుందనుకోవడం మాత్రం భ్రమే. అయితే ఇప్పుడు ఆర్డర్లీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని మద్రాస్ హైకోర్టు కాస్త స్ట్రాంగ్‌గా ఆదేశాలిచ్చింది. నాలుగు నెలల్లోగా తమిళనాడులో ఆర్డర్లీ వ్యవస్థ రూపు మాపాలని చెప్పింది.

పోలీస్ యూనిఫామ్ ధరించినా వారికి గౌరవం, మర్యాద ఇవ్వకుండా ఉన్నతాధికారుల ఇళ్లలో అన్ని పనులకు కిందిస్థాయి సిబ్బందిని వాడుకుంటుంటారు. ఇలాంటి సిబ్బంది అణగారిన తరగతిగా పరిగణించబడతారంటూ మద్రాస్ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి గొంతు లేని పోలీసుల కోసం గొంతు పెంచండి అంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఇది అధికార దుర్వినియోగమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పింది.

అధికారిక పోలీసు క్వార్టర్స్‌ విషయంలో అనధికారిక ఆక్రమణలు ఎక్కువయ్యాయంటూ ఇటీవల మాణిక్కవేల్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ పై జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఈ తీర్పు నిచ్చారు. దీంతోపాటు ఆర్డర్లీ వ్యవస్థపై చేసిన ఫిర్యాదుని కూడా న్యాయస్థానం పరిశీలించింది. తమిళనాడులో 1979లో ఆర్డర్లీ వ్యవస్థ రద్దయినప్పటికీ నేటికీ ఆ ఆదేశాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించింది మద్రాస్ హైకోర్టు. తాజాగా కోర్టు ఆదేశాల అనంతరం తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఆర్డర్లీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ సర్కులర్ జారీ చేశారు. తన నివాసంలో భద్రత, వైర్‌లెస్ ఆపరేషన్ విధుల్లో ఉన్న సిబ్బందిని ఇతర అవసరాల కోసం వాడుకోవడంలేదని ఆయన చెప్పారు. తనలాగే ఇతర అధికారులు కూడా ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని, కింది స్థాయి సిబ్బందిని కేవలం సెక్యూరిటీ కోసమే వాడుకోవాలని సూచించారు.