Chennai Metro: చెన్నై నగర వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులు మూడు వేర్వేరు మార్గాల్లో వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో పాటు శివారు ప్రాంతాలకు, అలాగే ఇతర ప్రాంతాలకు కొత్త మార్గాల ప్రతిపాదనలు కూడా మొదలయ్యాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ప్రకటించినట్లు, లైట్ హౌస్ నుండి మద్రాస్ హైకోర్టు, తాంబరం నుండి మేడవాక్కం మీదుగా వేళచ్చేరి వరకు పొడిగింపు మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) టెండర్లను ఆహ్వానించింది. లైట్ హౌస్ నుండి హైకోర్టు వరకు రాష్ట్ర సచివాలయం మీదగా మార్గం ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్గం నిర్మాణం తరువాత, ప్రస్తుతం సెంట్రల్ బ్లూలైన్ మీదుగా కాకుండా, దక్షిణ ప్రాంతం నుండి వచ్చే ప్రయాణికులకు సరాసరి హైకోర్టు చేరే అవకాశం ఉంటుంది. అలాగే, తాంబరం నుండి మేడవాక్కం మీదుగా వేళచ్చేరి వరకు 21 కిలోమీటర్ల మార్గం గృహ సముదాయాలు, వాణిజ్య సంస్థలు మరియు ఫోనిక్స్ మాల్ గుండా వెళ్లనుంది.
గంటకు 160 కి.మీ వేగం
అలాగే, తాజాగా ప్రకటించిన దాని ప్రకారం, 7 ప్రధాన మార్గాల్లో అధ్యయనాల కోసం మరో రెండు టెండర్లను సీఎంఆర్‌ఎల్ ఆహ్వానించింది. ఇందులో రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) పథకం కింద, చెన్నై నుండి విల్లుపురం, చెన్నై నుండి కాంచీపురం మీదుగా వేలూరు, కోయంబత్తూరు నుండి సేలం వరకు మార్గాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఢిల్లీ నుండి మీరట్ వరకున్న ‘ఆర్‌ఆర్‌టీఎస్’ మాదిరిగా, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచే విధంగా డిజైన్ చేయబడతాయి. ఈ మార్గంలో రైళ్లు 10 నుండి 15 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి, ఆగుతాయి. ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు ఆటోలు మరియు ఇతర రవాణా సదుపాయాలకు ఆధారపడేవారికి ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది.
మహాబలిపురం, కొడైక్కానల్, ఉదకమండల ప్రాంతాల్లో ‘హై అల్టిట్యూడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (హెచ్‌ఏటీఎస్)’ కోసం సాధ్యాసాధ్యాలపై నివేదిక కోసం కూడా సీఎంఆర్‌ఎల్ టెండర్లను ఆహ్వానించింది. రోప్‌వేలు, క్యాబిన్ కార్లు, ఫ్యునిక్యులర్ రైల్ సిస్టమ్స్‌ను కొండ ప్రాంతాలు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశపెట్టడానికి ముందుగా వాటి పొటెన్షియల్ పై అధ్యయనాలు జరపాలని అనుకుంటున్నారు.