Site icon HashtagU Telugu

Delhi : సీబీఐ అధికారుల‌మంటూ న‌గ‌ల వ్యాపారికి టోక‌రా వేసిన కేటుగాళ్లు

Crime

Crime

ఢిల్లీలో ఓ న‌గ‌ల వ్యాపారి మోస‌పోయాడు. ఢిల్లీలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో సీబీఐ అధికారుల‌మంటూ న‌మ్మించి న‌గ‌ల వ్యాపారి నుంచి రూ.40 లక్షలు తీసుకుని ప‌రారైయ్యారు. ఈ కేసులో ముఠా కింగ్‌పిన్‌తో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సందీప్ భట్నాగర్ (మాస్టర్ మైండ్), పవన్ గుప్తా, యోగేష్ కుమార్, హిమాన్షులుగా గుర్తించారు. నగల దుకాణం యజమాని హర్‌ప్రీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఫిర్యాదులో.. తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్న సింగ్, ఏప్రిల్ 17 న ఒక మహిళతో సహా 6 నుండి 7 మంది వ్యక్తులు సిబిఐ అధికారులమని చెప్పుకుంటూ తన దుకాణంలోకి ప్రవేశించారని తెలిపాడు. తన దుకాణంలో అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని నిందితులు వ్యాపారి సింగ్‌కు తెలిపారు. నిందితుడు సింగ్ నుండి కోటి రూపాయల లంచం డిమాండ్ చేశాడు. చివరికి అతను వారికి రూ. 40 లక్షల నగదు, అర కేజీ బంగారాన్ని ఇచ్చాడు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిందితులు న‌గ‌ల వ్యాపారి షాప్ నుంచి డివిఆర్‌ను తీసుకెళ్లారు.

సింగ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సింగ్ దుకాణం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేసిన పోలీసులు ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మే 10న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నిందితులు తాము దోపిడీకి కుట్ర పన్నినట్లు బాలీవుడ్ చిత్రం ‘స్పెషల్ 26’ నుండి ప్రేరణ పొందామని పోలీసులకు చెప్పారు. నిందితుల‌ వద్ద నుంచి రూ.11 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.