Forbes Highest Paid Player: ఆటకు బ్రేక్ వచ్చినా ఆదాయం తగ్గని ఫెదరర్

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడు.

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 05:09 PM IST

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నాడు. ఫోర్బ్స్‌ శుక్రవారం ప్రకటించిన జాబితాలో ఫెడెక్స్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది కాలంగా ఆటకు దూరమైనా అతని ఆర్జన మాత్రం తగ్గలేదు. వరుస గాయాలతో సతమతమవుతూ ఫాం కోల్పోయిన ఫెదరర్ ఆన్ ద ఫీల్డ్ లో ఎలాంటి ఆర్జన లేకున్నా….ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఎండోర్స్ మెంట్స్, బిజినెస్ వంటి వాటి ద్వారా 90 మిలియన్ డాలర్లు ఆర్జించాడు. తద్వారా అత్యధిక ఆదాయం కలిగిన టెన్నిస్ ప్లేయర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఫెదరర్ ఈ ఘనత సాధించడం ఇది 17వ సారి. కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ గెలిచిన ఈ స్విస్ స్టార్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు.

కాగా ఫోర్బ్స్ జాబితాలో జపాన్ ప్లేయర్ నయామి ఒసాకా రెండో స్థానంలో నిలిచింది. నాలుగు గ్రాండ్ స్లామ్ గెలిచిన ఒసాకా 56.2 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇటీవలే మీడియా కంపెనీలో ఎన్ బి ఏ స్టార్ ప్లేయర్ లెబ్రన్ జేమ్స్ తో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టింది. అలాగే అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా కంటే ఎక్కువ ఆదాయం కలిగిన ప్లేయర్ గా రికార్డులకెక్కింది. సెరెనా విలియమ్స్ 35.1 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉండగా…నాదల్ 31.4 మిలియన్ డాలర్లు, జకోవిచ్ 27.1 మిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.అలాగే ఎమ్మా రెడాకు 21.1 మిలియన్ డాలర్లు , మెద్వేదేవ్ 19.3 మిలియన్ డాలర్లు, నిషికొరి 13.2 మిలియన్ డాలర్లు , వీనస్ విలియమ్స్ 12 మిలియన్ డాలర్లు, యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ 10.9 మిలియన్ డాలర్లు తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ గా ఈ జాబితాలో ఫెదరర్ కు దరిదాపుల్లో ఈ టెన్నిస్ ప్లేయర్స్ లేకపోవడం విశేషం.