ఐదురాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ తన స్ట్రాటజీ మార్చుకుంటున్నట్టే ఉంది. కుల రాజకీయాలను పక్కనబెట్టి హిందుత్వ విధానంతోనే ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. దానికి కర్ణాటక నుంచే ప్రయోగం మొదలుపెట్టబోతోందా? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేవారి క్వాలిఫికేషన్ క్యా్స్ట్ కాదా? ప్రధాని మోదీ ఆ దిశగానే సంకేతాలిస్తున్నారా? మరి 2014 ఎన్నికల్లో పక్కనపెట్టిన హిందుత్వ విధానం.. మళ్లీ ఇప్పుడు ఎందుకు అక్కరకు వస్తోంది?
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడానికి కసరత్తు జరుగుతోంది. దీనికి తన వర్గం వ్యక్తిని ఎంపిక చేయాలని యడియూరప్ప పావులు కదుపుతున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి వర్గరాజకీయాలు, కుల రాజకీయాలకు తలొగ్గితే దానివల్ల నష్టం తప్ప లాభం లేదనేది బీజేపీ ఆలోచన. అందుకే వాటికి చెక్ పెట్టాలని భావిస్తోంది. మరి సోషల్ ఇంజనీరింగ్ తోనే అధికారంలోకి వచ్చే బీజేపీ.. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ను వదులుకుంటుందా? దానివల్ల లాభపడుతుందా? నష్టపోతుందా?
సంప్రదాయ కుల రాజకీయాలను బీజేపీ వద్దనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం తరువాత కమలనాథులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హిందుత్వ ప్లస్ డెవలప్ మెంట్. అంటే హిందుత్వ నినాదంతోపాటు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అందుకే రాష్ట్రస్థాయిలో బీజేపీకి నాయకత్వం వహిస్తూ శ్రేణులను ముందుకు నడిపించే లీడర్ నే పార్టీ అధ్యక్షులుగా చేయడానికి కసరత్తు చేస్తోంది.
కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ ను తొలగించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల విజయాన్ని చూపిస్తూ.. కర్ణాటక ఓటర్లను ప్రభావితం చేసే లీడర్ కే పగ్గాలు అప్పగించే ఛాన్సుంది. అందుకే దీనికి సంబంధించి ఓ మహిళకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 28 లోక్ సభ సీట్లకు గాను 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2019 మాండ్యా లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో కులరాజకీయాలు పనిచేయలేదు. సుమలత అంబరీష్ తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆమెను గెలిపించిందీ కులరాజకీయాలు కాదని బీజేపీ భావిస్తోంది.
కమలనాథులు ఇక్కడ గుర్తించాల్సింది ఒకటుంది. హిందుత్వ నినాదం అన్నిసార్లు పనిచేయదు. దానికి 2014 ఎన్నికలు ఉదాహరణ. ఇక అభివృద్ధి మంత్రమూ అన్నిసార్లూ అక్కరకు రాకపోవచ్చు. ఇక భావోద్వేగాలను ఎలా ఓటు బ్యాంకుగా మార్చుకోవాలో రాజకీయనాయకులకు వేరే చెప్పక్కరలేదు. సో.. కమలం పెద్దలు ఈసారి ఎలాంటి వ్యూహంతో వెళతారో చూడాలి.