Karnataka Rains : క‌ర్ణాట‌క‌లో మునిగిన పంప్ హౌస్ , బెంగుళూరుకు నీళ్ల బంద్‌

కావేరి నది నుండి బెంగుళూరు న‌గ‌రానికి నీటిని ఎత్తిపోసేందుకు కర్ణాటకలోని మాండ్య వ‌ద్ద ఉన్న పంపింగ్ స్టేష‌న్ మునిగిపోయింది.

  • Written By:
  • Updated On - September 5, 2022 / 04:39 PM IST

కావేరి నది నుండి బెంగుళూరు న‌గ‌రానికి నీటిని ఎత్తిపోసేందుకు కర్ణాటకలోని మాండ్య వ‌ద్ద ఉన్న పంపింగ్ స్టేష‌న్ మునిగిపోయింది. దీంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేయబడుతుంది. వర్షాలతో దెబ్బతిన్న బెంగళూరులోని దాదాపు 50 ప్రాంతాలకు రానున్న రెండు రోజుల పాటు తాగునీరు బంద్ కానుంది. మండ్యలోని టీకే హళ్లి నీటి సరఫరా యూనిట్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సందర్శించారు. ప్రస్తుతం పంపింగ్ స్టేషన్‌లోని నీటిని అధికారులు బయటకు తోడుతున్నారు.

యంత్రాన్ని పునఃప్రారంభించేందుకు సాంకేతిక బృందం స్పాట్‌లో ఉంది. బెంగళూరుకు మంచినీళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఈ యూనిట్ కీలకం. బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నందున, రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపారు. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు మొత్తం 30 ప్రాంతాలు దెబ్బతిన్నాయి. నగరంలోని అనేక సరస్సులు పొంగిపొర్లడం, మురికినీటి కాలువలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇళ్లలోకి వ‌ర్ష‌పునీరు ప్ర‌వేశించ‌డంతో ప‌లు ప్రాంతాల్లో సాధారణ జీవితం అస్త‌వ్య‌వ‌స్తం అయింది.

సర్జాపూర్ రోడ్‌లోని రెయిన్‌బో డ్రైవ్ లేఅవుట్ , సన్నీ బ్రూక్స్ లేఅవుట్ త‌దిత‌ర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఉదయం విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారిని ట్రాక్టర్లు , పడవలు ద్వారా త‌ర‌లించారు. ఔటర్ రింగ్ రోడ్‌లోని పలు ప్రాంతాలు వర్షం, వరదల కారణంగా కొన్ని ఐటీ కంపెనీలు దెబ్బతిన్నాయని నివేదికలు చెబుతున్నాయి.