Site icon HashtagU Telugu

Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?

Extramarital Affairs

Extramarital Affairs

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి, ఏ రంగంలో ఉన్నవారు ఎక్కువగా భర్త, భార్యను వదిలేసి వేరే వాళ్లతో కాపురాలు చేస్తున్నారోనని గ్లీడెన్ సంస్థ ఓ సర్వే చేసింది. ఈక్రమంలోనే ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా భారతదేశంలో వివాహేతర సంబంధాల విషయంలో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచిందని గ్లీడెన్ (Gleeden) అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. వివాహ వ్యవస్థలో విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్న నగరాల జాబితాలో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా.. ముంబయి రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో కోల్‌కతా, నాలుగో స్థానం దిల్లీ, ఐదో స్థానంలో పుణె నగరాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా వివాహేతర సంబంధాలు నానాటికీ పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య, కుటుంబ కలహాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ పరిణామం భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అధ్యయన నివేదిక మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. సాధారణ పౌరులతో పోలిస్తే.. ఐటీ, వైద్య రంగాల్లో పని చేస్తున్న వాళ్లే ఇతరుల కన్నా ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని తేటతెల్లమైంది. బిజీ లైఫ్, అధిక ఒత్తిడి, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి అంశాలు.. త్వరగా ఇతరుల ఆకర్షణకు లోనయ్యేలా చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వివాహ వ్యవస్థలో ఈ విధమైన దారుణ పరిణామాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలను ఈ నివేదిక స్పష్టంగా గుర్తించింది. ఉద్యోగపరమైన ఒత్తిడి వల్ల తమ జీవిత భాగస్వాములు కుటుంబానికి తగినంత సమయం కేటాయించకపోవడం వల్ల మనస్పర్థలు వస్తున్నాయని వివరించింది. అలాగే కుటుంబ సభ్యుల భావోద్వేగ అవసరాలు, వ్యక్తిగత కోరికలను సరిగా పరిగణనలోకి తీసుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం, వాళ్లు ఒంటరిగా ఫీలయ్యేలా చేయడం వల్ల వేరే వ్యక్తులకు దగ్గర అవుతున్నారని పేర్కొంది.

ఈ వివాహేతర సంబంధాల వల్ల తలెత్తుతున్న సమస్యలు అనేక కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ పద్ధతి తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చినా.. చివరికి ఎన్నో మానసిక, సామాజిక సమస్యలకు దారి తీస్తుందని, కొందరి జీవితాలను పెను విషాదంలోకి నెడుతోందని అభిప్రాయ పడుతున్నారు. దేశ ఆర్థిక రాజధానులుగా పేరుగాంచిన ఈ నగరాల్లో నైతిక విలువలు, మానవ సంబంధాల కంటే వృత్తి జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ సంక్షోభానికి మూల కారణమని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version