3 Years Prison : తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి , ఆయన భార్య విశాలాక్షికి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.జయచంద్రన్ తీర్పును వెలువరించారు. నిందితులు లొంగిపోయేందుకు 30 రోజుల టైంను కోర్టు మంజూరు చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసుకోవచ్చని తెలిపింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడటంతో తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి శాసనసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోనున్నారు. అంతకుముందు గతేడాది జూన్ 28న ఇదే కేసును విచారించిన వేలూరులోని దిగువ కోర్టు పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు(3 Years Prison) ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఏసీబీ ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయలేదు. దీంతో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి మంత్రి పొన్ముడితో పాటు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు పొన్ముడి, ఆయన భార్యకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు మూలాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాకు చెందిన పొన్ముడి పీహెచ్‌డీ చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డీఎంకే వైపు ఆకర్షితులయ్యారు. మంత్రి పొన్ముడి 1989లో డీఎంకే టికెట్‌పై తొలిసారి విల్లుపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1996-2001 మధ్యకాలంలో ఆయన రవాణాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ టైంలో పొన్ముడి, ఆయన భార్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ 2002లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడికి శిక్ష పడింది.