కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు సిద్ధూ అనుచరులు సైతం లాబీయింగ్‌లు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లు పూర్తిచేసుకోవడంతో కర్ణాటకలో మరోసారి అధికార మార్పిడి అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి సిద్ధూకు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇదే సమయంలో బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం అధిష్ఠానంతో సిద్ధరామయ్య భేటీ అయ్యి చర్చలు జరపడం మరింత వేడెక్కింది. క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఇవ్వాలని సిద్ధూ కోరారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో ఏడాది పాటు తన పదవికి ఢోకా ఉండదనేది ఆయన ఎత్తుగడ. కానీ, దీనికి ముందు కాంగ్రెస్ అగ్ర నేతలతో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీలో కేవలం పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించినట్టు ఆయన చెప్పారు.
మరోవైపు, కాంగ్రెస్ అదిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు డీకే అనుచరులు ఢిల్లీకి చేరుకున్నారు. డీకేకు పగ్గాలు అప్పజెప్పాలని అధిష్ఠానం పెద్దలను కోరారు. ఈ క్రమంలో డీకే వర్గానికి చెందిన రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భరోసా ఇచ్చారని, అంతా సక్రమంగా జరుగుతుందని అన్నారు. డీకేస్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల అభిప్రాయం కోరిన ఖర్గే.. ఈ అంశంపై పార్టీ కీలక నాయకత్వాన్ని సంప్రదిస్తానని వారికి చెప్పారని ఆయన అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి డీకే శివకుమార్ ఎంతో కష్టపడ్డారు.. ఆయన సీఎం పదవికి అర్హులే.. ఆయనకు ఆ సత్తా ఉంది.. కాబ్టి సిద్ధరామయ్య స్థానంలో డీకేకు సీఎంగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరాం అని తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వారం రోజుల సమయం ఇవ్వమని అడిగారని, దీనిపై అధినాయకత్వంతో చర్చిస్తానని చెప్పారు.. కాబట్టి ఆయన టైం కోరారు.. నిర్ణయం అనుకూలంగా వస్తుందని ఆశతో ఉన్నాం’ అని రామనగర ఎమ్మెల్యే అన్నారు.
కాగా, డీకేకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలపై హుస్సైన్ స్పందిచారు. డీకే సామర్థ్యాన్ని ప్రశంసిస్తూనే సీఎం సిద్ధరామయ్యపై ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడారు. ‘‘మాకు సిద్ధరామయ్య సర్‌పై నమ్మకం ఉంది.. ఆయన చాలా మంచి వ్యక్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి అని అందరికీ తెలుసు కాబట్టి, మాకు ఆయనపై మంచి నమ్మకం ఉంది.. ఆయన మాట నిలబెట్టుకునే వ్యక్తి. పరిస్థితిని అర్థం చేసుకుంటారు.. దానికి గౌరవం ఇస్తారు’’ అని హుస్సైన్ వ్యాఖ్యానించారు. ఇటీవల డీకే సోదరుడు సురేష్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి ‘మాట మార్చే వ్యక్తి కాదని’ అన్నారు.
హుస్సైన్‌తో పాటు వ్యవసాయశాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి సహా కర్ణాటక ఎమ్మెల్యేల బృందం గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారని సమాచారం.
