Site icon HashtagU Telugu

Mother Tortured: కన్నతల్లిని పదేళ్లు బంధించిన దుర్మార్గులు.. వారానికోసారి బిస్కెట్లు విసిరేస్తూ…!

Tamilnadu Incident

Tamilnadu Incident

దుర్మార్గులంటే ఎక్కడో ఉండరు.. మన కళ్లముందే.. మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నవమాసాలు మోసి కని, పెంచి, ప్రయోజకులను చేసిన కన్నతల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించారు ఇద్దరు సుపుత్రులు. తమిళనాడులోని జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఇలాంటి కొడుకులను ఎందుకు కన్నానురా భగవంతుడా అని ఆ కన్నతల్లి అనుక్షణం బాధపడి ఉంటుంది.

తమిళనాడులోని తంజావూరు జిల్లా కావేరీనగర్ లో ఉంటారు 62 ఏళ్ల జ్ఞానజ్యోతి. ఆమెకు ఇద్దరు కుమారులు. మామూలుగా అయితే ఈ వయసులో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆమె ఆలనాపాలనా చూడాలి. కనీసం మూడుపూటలా కడుపునిండా భోజనం అయినా పెట్టాలి. కానీ ఆమె ఇద్దరు కుమారులు మాత్రం అలా చేయలేదు. పైగా ఆవిడను ఓ ఇంట్లో బంధించి ఉంచారు. వారానికోసారి వచ్చి కిటికీలోంచి బిస్కెట్లు విసిరేసి వెళ్లిపోయేవారు. పదేళ్లపాటు ఆమె అలాగే బందీగానే ఉండిపోయింది.

జ్ఞానజ్యోతి తన కొడుకులను ప్రయోజకులనే చేసింది. పెద్ద కొడుకు పేరు షణ్ముగసుందరన్. చెన్నైలోనే ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు వెంటేశన్. ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగాన్నే వెలగబెడుతున్నాడు. అంత పెద్ద హోదాల్లో ఉండి కూడా వారి బుద్ధి గడ్డి తింది. పదేళ్ల కిందట తమ తండ్రి, సోదరి దూరమయిన తరువాత కన్నతల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా ఆస్తికోసం గొడవలు పడ్డారు. తల్లికి దూరంగా ఉంటున్నారు.

కన్నతల్లి అని కూడా చూడకుండా ఆ ఇద్దరు కొడుకులు.. ఆమెను ఇంట్లోనే బంధించినా.. స్థానికులే ఆమెను చూసి జాలిపడి ఆహారం పెట్టేవారు. కానీ ఈ విషయాన్ని గమనించిన ఓ సామాజిక కార్యకర్త.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జ్ఞానజ్యోతి మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version