Swiggy: స్విగ్గీ పార్శిల్‌లో నకిలీ రూ.2,000 నోట్లు చూసి షాక్ అయిన కస్టమర్లు

స్విగ్గీలో ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో ఏం ఉంటుంది? ఆర్డర్ చేసిన ఐటెమ్స్, బిల్‌తో పార్శిల్ వస్తుంది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) వినూత్నంగా మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేసింది. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ ప్రమోషన్ కోసం కొత్తగా ఆలోచించింది. ఫర్జీ వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తమ కస్టమర్లకు నకిలీ రూ.2,000 నోట్లను పార్శిల్‌లో పంపించింది. దీంతో కస్టమర్లు అవాక్కయ్యారు. ఫర్జీ అంటే తెలుగులో నకిలీ, చెల్లనిది, కృత్రిమం అని అర్థం. ఆ అర్థానికి సరిపోయేలా నకిలీ రూ.2,000 నోట్లను పార్శిల్‌లో పంపించింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart). పార్శిల్ ఓపెన్ చేయగానే రూ.2,000 నోట్లు చూసి ఖంగుతిన్నారు కస్టమర్లు. కానీ అవి నకిలీ నోట్లను తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. తమకు స్విగ్గీ పార్శిల్‌లో రూ.2,000 నకిలీ నోట్లు వచ్చాయంటూ కస్టమర్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. ముంబై, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, కోల్‌కతా, బెంగళూరు, పూణె, చెన్నై, హైదరాబాద్‌లోని కస్టమర్లకు స్విగ్గీ పార్శిల్‌లో ఇలా రూ.2,000 నకిలీ నోట్లు వచ్చాయి.

 

నకిలీ రూ.2,000 నోట్లపై ఫర్జీ వెబ్ సిరీస్‌లో నటించిన షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ఫోటోలు ఉన్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ప్రైమ్ వీడియో లోగోలు కూడా ఉన్నాయి. వీటితోపాటు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా ఉంది. ఆ కోడ్ ఉపయోగించి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు డిస్కౌంట్ పొందొచ్చు. ఫర్జీ వెబ్ సిరీస్ రూ.2,000 నకిలీ నోట్ల చుట్టూ ఉంటుంది. అందుకే ఫర్జీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలా రూ.2,000 నకిలీ నోట్లను ఉపయోగించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఫర్జీ వెబ్ సిరీస్ ప్రమోషన్‌ను తెలివిగా చేశారు. కానీ కస్టమర్లే రూ.2,000 నోట్లు చూసి ఖంగుతిన్నారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 2020 ఆగస్ట్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం 25 నగరాలు, పట్టణాల్లో గ్రాసరీ సేవల్ని అందిస్తోంది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. స్విగ్గీ టెక్నాలజీ, డెలివరీ వ్యవస్థను ఉపయోగించుకొని స్విగ్గీ గ్రాసరీలను, నిత్యావసర వస్తువుల్ని భారతీయ కస్టమర్లకు డెలివరీ చేస్తోంది.

Also Read:  G20: మొదటి G20 సమావేశంలో, ఆర్థిక మంత్రులు గ్లోబల్ ఎకానమీ, రుణాలపై చర్చించారు