Sabarimala: శబరిమలలో భక్తుల సందడి, రికార్డు స్థాయిలో దర్శనం

  • Written By:
  • Updated On - January 1, 2024 / 06:01 PM IST

Sabarimala: కొత్త సంవత్సరం తొలి రోజు కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్‌ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భద్రతను పెంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఇదే తొలిసారని ఆలయ వర్గాలు తెలిపాయి. 2021 జనవరి 1న మధ్యాహ్నానికి సుమారు 18 వేల మంది భక్తులు ఇరుముడులు సమర్పించగా, ఆ తర్వాత 2024, జనవరి 1న భక్తులు రికార్డు స్థాయిలో వచ్చినట్లు వెల్లడించారు. 41 రోజుల మండల పూజ అనంతరం గత నెల 27వ తేదీ రాత్రి ఆలయ ద్వారాలను మూసివేసిన సంగతి తెలిసిందే. అనంతరం శనివారం మకరజ్యోతి ఉత్సవాల కోసం ఆలయం తిరిగి తెరుచుకుంది.  15న మకరజ్యోతి వేడుక ఉంటుంది.