Site icon HashtagU Telugu

karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ లో జోష్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు

Congress

Congress

కర్ణాటక కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఇప్పుడు అందివచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించడంతో అందులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున మధు జి.మాదెగౌడ పోటీ చేశారు. ఎన్నికల ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్ లో సంతోషం పెరిగింది. ఎందుకంటే ఈ విజయం అంత ఆషామాషీగా రాలేదు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాత కాంగ్రెస్ అభ్యర్థి మధు జి.మాదెగౌడకు 46,082 ఓట్లు వచ్చాయి. బీజేపీ తరపున పోటీ చేసిన ఎంవీ రవిశంకర్ కు 33,878 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ అభ్యర్థి హెచ్.కె.రాముకు 19,630 ఓట్లు వచ్చాయి. వీరితోపాటు పోటీ చేసిన మరో 16 మంది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో జేడీఎస్ పార్టీ.. తన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కు ఇచ్చినట్టయ్యింది.

కావేరీ జలాలపై సీనియర్ పార్లమెంటేరియన్ అయిన జి.మాదెగౌడ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అదే మధు జి.మాదెగౌడ విజయానికి దోహదపడిందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ఈ విజయంతో మాదెగౌడ వారసుడిగా మధుకు రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ లభించినట్టే అని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి, జేడీఎస్ నుంచి చెరో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఇదే ఉత్సాహంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని కచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకంతో చెబుతోంది. అంటే బీజేపీకి పెద్ద సవాల్ ఎదురైనట్టే.

Exit mobile version