Contractor Suicide: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసేదాకా నిరసనలు ఆపం : కాంగ్రెస్

కన్నడనాట బెళగావికి చెందిన కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 04:18 PM IST

కన్నడనాట బెళగావికి చెందిన కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్ప తో పాటు ఆయన అనుచరులు బసవరాజ్ , రమేష్ పేర్లను పోలీసులు చేర్చారు. ఈ కేసుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం కీలక ప్రకటన చేశారు. కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసుతో ముడిపడిన ప్రాధమిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ” బుధవారం సాయంత్రమే కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. దర్యాప్తునకు సంబంధించిన ప్రాధమిక వివరాల కోసం వేచి చూస్తున్నాం. ఈ కేసులో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి జోక్యమూ చేసుకోవడం లేదు ” అని ఆయన మీడియాకు తెలిపారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన నిరసనలను ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రూ.4 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టు పనుల బిల్లులను చెల్లించేందుకు మంత్రి ఈశ్వరప్ప నిరాకరించడం వల్లే ఈనెల 12న (మంగళవారం) కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఉడిపి లోని ఒక హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. వెంటనే మంత్రి ఈశ్వరప్ప ను అరెస్టు చేయాలన్నారు.