Site icon HashtagU Telugu

CM Stalin: ఢిల్లీ వెల్లింది కాళ్ళు మొక్క‌డానికి కాదు.. స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Cm Stalin Palani Swami

Cm Stalin Palani Swami

త‌మిళ‌నాడు పాలిటిక్స్ రంజుగా సాగుతున్నాయి. అక్క‌డ అధికార డీఎంకే, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే నేత ఇటీవ‌ల సీఎం స్టాలిన్ ఢిల్లీ అండ్ దుబయ్ టూర్ పై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌ళ‌నిస్వామి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స్టాలిన్ తాను ఢిల్లీ వెళ్ళింది త‌మిళ‌నాడు హ‌క్కుల్ని సాధించుకోవ‌డానికే గానీ, ఎవ‌రో ఒక‌రి కాళ్ళ మీద ప‌డ‌డానికి కాద‌న్నారు.

ఇక త‌మిళ‌నాడు లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక, నగర ఎన్నికల్లో గెలుపుతో డీఎంకే కూటమిపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నమ్మకం పెరిగింద‌ని, తన వద్దకు వ‌చ్చి త‌మిళ ప్రజలు కోరే ప్ర‌తి కోరిక‌ను ఆచరణలో పెడుతానని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. తన ఢిల్లీ అండ్ దుబాయ్, పర్యటన గురించి విమర్శలు చేసే వాళ్లకు తాను ఒక్కటే చెబుతున్నానని, తాను ఢిల్లీకి పాదాభివందనాలు చేయడానికి వెళ్ల లేదన్నారు. కేవ‌లం తమిళనాడు హక్కుల్ని పరిరక్షించడం, సాధించుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ వెళ్లానని స్పష్టం చేశారు.

ఈ నేప‌ధ్యంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా మంత్రులందరూ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని చూసి ప్ర‌తిప‌క్ష అన్న‌డీఎంకే పార్టీ నేత‌లు ఓర్వలేక పోతున్నార‌ని, త‌న‌పై విమర్శలు గుప్పించిన వారిపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు, అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా కొందురు క‌ట్టు క‌థ‌లు సృష్టించి ఆ వార్త‌లు జోరుగా ప్ర‌చారం చేయ‌డం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఇక తాను సాధారణ స్టాలిన్‌ కాదని, ముత్తు వేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అని, త‌మిళనాడు రాష్ట్రం కోసం, త‌మిళ ప్ర‌జ‌ల హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధ‌మే అని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పారు. మ‌రి స్టాలిన్ కౌంట‌ర్ పై అన్నా డీఎంకే నాయ‌కుల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా స్టాలిన్‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే పార్టీ నేత‌లు ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా, స్టాలిన్ తిప్పి కొడుతున్నారు.