ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954కి ప్రతిపాదిత సవరణలపై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఇది దేశ సమాఖ్య రాజకీయాలు, రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఇబ్బంది కలిగించే అంశంగా ఉందని ఆయన లేఖలో ప్రస్తావించారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానిని కోరారు. సివిల్ సర్వెంట్లు ఓపెన్ మైండ్‌తో పనిచేయడానికి, రాజకీయాలకు అతీతంగా ఉండటానికి అనుమతించాలని ఆయన తెలిపారు. ప్రతిపాదిత సవరణలు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని.. రాష్ట్రాల మధ్య ఉన్న సహకార సమాఖ్య స్ఫూర్తికి కోలుకోలేని హాని కలిగిస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు. జాతీయ స్థాయిలో గ్రూప్-1 అధికారుల సాధారణ పూల్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నప్పటికీ, రాష్ట్రాలు రాష్ట్ర పరిమిత ఐఏఎస్ అధికారులపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమాలతో సహా అనేక కార్యక్రమాలను అమలు చేయడంలో రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని.. రాష్ట్రాలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నందున, ఐఏఎస్ అధికారుల సహాయం చాలా అవసరమని స్టాలిన్ పేర్కొన్నారు.
CM Stalin : ఐఏఎస్ రూల్స్ మార్పుకు స్టాలిన్ ‘నో’
