CM Stalin: రాష్ట్రాలపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వ వైఖరిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నవారు సుల్తాన్లు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు బానిసలు కావు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, శాసనసభలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపిన బిల్లులను వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విలువలను పరిరక్షించిందన్నారు.
గవర్నర్ లేదా ప్రధానితో వ్యక్తిగతంగా తమకు విరోధమేమీ లేదని, వారి పదవులకు తగిన గౌరవాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే రాజ్‌భవన్‌లు, విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేసే కేంద్రాలుగా మారాయని, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆదేశాల్ని అమలు చేసే చట్టవిరుద్ధ ప్రతినిధుల్లా గవర్నర్లు పనిచేస్తున్నారని ఆరోపించారు.
స్వయంప్రతిపత్తి వ్యవస్థను, సమాఖ్య పాలనను దాదాపు 50 ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిస్తోందని తెలిపారు. కేంద్రంలోని ప్రస్తుత భాజపా ప్రభుత్వం తమని తాము సుల్తాన్‌గా భావించి రాష్ట్రాల హక్కులను గుంజుకోవాలని చూస్తోందని, విద్య, న్యాయం, పన్నులు, పరిపాలన తదితర రంగాలలో రాష్ట్రాల అధికారాలను దకించుకోవాలని చూస్తుందని విమర్శించారు.
తమిళనాడులో ఇనుప పరికరాల తయారీకి సంబంధించిన సాంకేతికత 5,300 సంవత్సరాల క్రితమే ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువు చేసామని చెప్పారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం అయినా, ప్రధాని మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై శుభాకాంక్షలు చెప్పకపోవడం చూస్తే, తమిళులను భారతదేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
2026 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మరియు దాని మిత్ర పక్షాలు విజయం సాధించేందుకు తగిన బలంతో ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, జలవివాదాల్లో రాష్ట్రానికి సముచిత వాటా దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
“గవర్నర్ పదవి అవసరమేనా?”
ఇంకొక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, గవర్నర్ పదవి అవసరం లేదన్న అభిప్రాయాన్ని తమ పార్టీ కలిగి ఉందని తెలిపారు. అయినప్పటికీ ఆ పదవిలో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడం అవసరమని అన్నారు. ప్రతి ఎన్నికలోనూ రాష్ట్ర స్వయంప్రతిపత్తి విధానంతోనే ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్వయంప్రతిపత్తి కమిటీపై కొందరు వక్రీకరణలు చేస్తున్నారని, ఇది ఎలక్షన్ల కోసమే అన్నదానిని తిప్పికొట్టారు. అన్నాడీఎంకే–భాజపా కూటమి గతంలో విఫలమైందని, ప్రజలు మరోసారి వారిని తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రవేశించేందుకు భాజపా నాయకులు చేస్తున్న అర్థరహిత వ్యాఖ్యలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భాజపా చేసిన ప్రజాస్వామ్య విఘాత చర్యలకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.