Site icon HashtagU Telugu

KCR Federal Front : ఎండ‌మావిగా ‘కేసీఆర్’ ఫ్రంట్

Mamata Kcr

Mamata Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తోన్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు ఆదిలోనే హంస‌పాదులాగా వ్య‌తిరేక వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూట‌మి సాధ్యంకాద‌ని ఆయ‌న‌తో భేటీ అయిన వాళ్లు తేల్చేస్తున్నారు. తాజాగా ప్ర‌గ‌తిభ‌వ‌న్లో కేసీఆర్‌ను క‌లిసిన లాలూ కుమారుడు తేజ‌స్వీయాద‌వ్ జ‌ల‌క్ ఇచ్చాడు. ఆర్జీడీ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డానికి కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం బెడిసికొట్టింద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ లేకుండా కూట‌మి సాధ్యం కాద‌ని, ఫ్రంట్ దిశ‌గా రాలేమ‌ని ఖ‌రాఖండిగా తేజ‌స్వి స‌మాచారం పంపాడ‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల టాక్‌.ఇటీవ‌ల త‌మిళ‌నాడు వెళ్లిన సీఎం కేసీఆర్ అక్క‌డి సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యాడు. ఆ సంద‌ర్భంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీద చ‌ర్చంచారు. కానీ, స్టాలిన్ నుంచి సానుకూల స్పంద‌న కేసీఆర్ కు రాలేద‌ని తెలిసింది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉండే స్టాలిన్ ఆ పార్టీని వీడి ఈజీగా రాలేడు. పైగా యూపీఏ 1,2 సంద‌ర్భంగా కీల‌క భాగ‌స్వామిగా డీఎంకే ఉంది. స్వ‌ర్గీయ క‌రుణానిధి హయాం నుంచి గాంధీ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. అలాంటి బంధాన్ని వ‌ద‌లిపెట్టుకుని కేసీఆర్ తో క‌లిసి న‌డిచే ప‌రిస్థితి స్టాలిన్ చేయ‌డ‌ని డీఎంకే వ‌ర్గాల వినికిడి.

ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీల జాతీయ లీడ‌ర్లు సీఎం కేసీఆర్ తో ఇటీవ‌ల భేటీ అయ్యారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త కోణం నుంచి మాత్ర‌మే కేసీఆర్ తో వాళ్లు క‌లిసి న‌డిచే ఛాన్స్ ఉంది. జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ లు తొలి నుంచి సానుభూతిప‌రులు. యూపీఏ 1 సంద‌ర్భంగా అన్నీ తామై కామ్రేడ్లు న‌డిపారు. ఆ అనుభ‌వం దృష్ట్యా కాంగ్రెస్ తో క‌లిసి ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఒక వేళ కేసీఆర్ తో క‌లిసి న‌డ‌వ‌డానికి ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ద‌క్షిణ భార‌త‌దేశంలో మాత్ర‌మే ఆ ఫ్రంట్ కు కొంత మేర ఆద‌ర‌ణ ఉంటుంది. ఉత్త‌ర భార‌త‌దేశంలోని రాష్ట్రాల‌ను గ‌మ‌నిస్తే, ఎక్క‌డా కేసీఆర్ కు స్థానం లేకుండా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.ఆప్ కేజ్రీవాల్, టీఎంసీ చీఫ్ మ‌మ‌త ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వుల రేస్ లో ఉన్నారు. పైగా వాళ్లిద్ద‌రి పార్టీలు మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ కూడా కాంగ్రెస్ పార్టీని వ‌ద‌లి ఈజీగా బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక కేసీఆర్ ఎవరితో ఫ్రంట్ క‌డ‌తాడు అనేది పెద్ద ప్ర‌శ్న‌. మంత్రివ‌ర్గ స‌మావేశంలో మోడీ స‌ర్కార్ తో ఢీ కొట్టేలా ప్లాన్ చేస్తాడ‌ని భావించినప్ప‌టికీ ఆయ‌న‌తో క‌లిసి జాతీయ స్థాయిలో క‌లిసి వ‌చ్చే వాళ్లు పెద్ద‌గా లేర‌ని తెలుస్తోంది.

బీజేపీకి వ్య‌తిరేకంగా ఉండే పార్టీలు కూడా కేసీఆర్ ను పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోలేక‌పోతున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు మోడీ స‌ర్కార్ అడుగుల్లో అడుగు వేస్తూ టీఆర్ఎస్ పార్టీ న‌డిచింది. తొలి విడ‌త ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఉప రాష్ట్ర‌ప‌తి, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నుంచి 370ర‌ద్దు, సీఏఏ త‌దిత‌ర వివాద‌స్ప‌ద అంశాల‌న్నింటికీ మ‌ద్ధ‌తు ఇచ్చింది. తాజాగా వ్య‌వ‌సాయ బిల్లుకు కూడా పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌ద్ధ‌తు ప‌లికింది. రైతు ఉద్య‌మానికి నాయకత్వం వ‌హించిన నాయ‌కుడు తికాయత్ కూడా కేసీఆర్ ను రైతు వ్య‌తిరేకిగా అభివ‌ర్ణించాడు. ఈ చ‌రిత్ర‌ను ప‌రిశీలించిన ఇత‌ర రాష్ట్రాల్లోని పార్టీలు కేసీఆర్ ను ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డానికి తొంద‌ర‌గా ముందుకు రాలేని ప‌రిస్థితి.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్ స్థానాల‌కుగాను తొమ్మిది మాత్ర‌మే టీఆర్ఎస్ కు ఉన్నాయి. బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు ముగ్గురు, ఎంఐఎంకు ఒక్క‌రు ఎంపీలుగా ఉన్నారు. తొమ్మిది మంది ఎంపీల‌తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కుద‌ర‌ని అంశం. ఈసారి ఎన్నిక‌ల్లో ఎంపీల సంఖ్య ఎంత అనేది కూడా పెద్ద ప్ర‌శ్న‌. మూడోసారి సీఎంగా కేసీఆర్ గెలుస్తాడా? లేదా? అనేది కూడా జాతీయ స్థాయిలోని చ‌ర్చ‌. ఒక వేళ మూడోసారి సీఎం అయిన‌ప్ప‌టికీ 2019లో వ‌చ్చిన తొమ్మిది ఎంపీ స్థానాలు ఈసారి టీఆర్ఎస్‌కు వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనేది ఒక ఎండ‌మావిగా వివిధ రాష్ట్రాల‌కు చెందిన పార్టీల చీఫ్ లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.