Corona 3rd Wave : సీఎంలూ…బ‌హుప‌రాక్.!

ప్ర‌కృతి వైప‌రిత్యాలు, వైర‌స్ లు వ్యాప్తి చెందుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వాధినేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సరైన స‌మాచారం చేర‌వేయ‌డంతో పాటు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 07:40 PM IST

ప్ర‌కృతి వైప‌రిత్యాలు, వైర‌స్ లు వ్యాప్తి చెందుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వాధినేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సరైన స‌మాచారం చేర‌వేయ‌డంతో పాటు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కానీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆ దిశ‌గా ఆలోచించ‌డంలేదు. క‌రోనా మూడో వేవ్ `ఓమైక్రిన్ ` రూపంలో ముంచుకొస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌శాఖ చెబుతోంది. అయిన‌ప్పటికీ ఎలాంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌కు ఉప‌క్రమించిన దాఖ‌లాలు క‌నిపించ‌డంలేదు. కేవ‌లం కేంద్రం నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశం వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం వ‌ర‌కు ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జ‌గన్ ప‌రిమితం అయ్యారు.

క‌రోనా తొలి వేవ్ గురించి అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ ఎలా స్పందించాడో..మ‌నంద‌రికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి క‌రోనా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అన్నాడు. మాస్క్ లు లేకుండా అసెంబ్లీ నిర్వ‌హిస్తున్నామ‌ని గ‌ప్పాలు ప‌లికాడు. వేస‌వి తీవ్ర‌త‌38 డిగ్రీల‌కుపైగా ఉంటుంది. కాబ‌ట్టి క‌రోనా వైర‌స్ మాడిపోతుంద‌ని అసెంబ్లీ వేదిక‌గా బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ మాట్లాడాడు. జ్వ‌రం వ‌స్తే ఒక గోలి వేసుకుంటే పోతుంద‌ని చెప్పాడు. ఆయ‌న మాట‌ల‌ను ప్ర‌జ‌లు విన్నారు. కానీ, క‌రోనా సీరియ‌స్ ను గ‌మనించిన ప్ర‌ధాని మోడీ ఆక‌స్మికంగా లాక్ డౌన్ ప్ర‌కటించాడు. ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎలా ఇబ్బంది ప‌డ్డారో..తెలుసు. క‌నీసం ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఎంత మంది చ‌నిపోయారో కూడా వెల్ల‌డించ‌లేదు.

ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా ఉండేందుకు రెండో వేవ్ కు ముందుగా ప్ర‌జ‌ల్ని గాలికి వ‌దిలేశాడు కేసీఆర్‌. ప్రైవేటు ఆస్ప‌త్రుల దందాకు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ఇచ్చేలా స‌డ‌లింపులు ఇచ్చేశాడు. ఆస్ప‌త్రుల్లో భారీ మొత్తంలో వేసిన‌ బిల్లుల గురించి ప‌ట్టించుకోలేదు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్యం గురించి చ‌ర్య‌లు తీసుకోలేదు. రెండో వేవ్ లో ఎంత మంది చ‌నిపోయారో…స్మ‌శానాల వ‌ద్ద క్యూలు స్ప‌ష్టం చేశాయి.
ఇదే త‌ర‌హాలో ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించాడు.తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే కొంత మెరుగ్గా రెండో వేవ్ క్ర‌మంలో వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేశాడు. కానీ, మ‌ర‌ణాల‌ను మాత్రం త‌గ్గించ‌లేక‌పోయాడు. ఆస్ప‌త్రుల బిల్లుల‌ను మాత్రం తెలంగాణ కంటే కొంత మేర‌కు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు. అవ‌గాహ‌న లేకుండా బాధ్య‌తారహితంగా క‌రోనాగురించి సీఎం సీఎం జ‌గ‌న్ మాట్లాడాడు. బ్లీచింగ్ చల్లితే క‌రోనా వ్యాప్తి త‌గ్గుతుంద‌ని చెప్పాడు. ప్యారాసిట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే…కంట్రోల్ అవుతుంద‌ని చెప్పాడు.అంతేకాదు,స‌హ‌జీవ‌నం క‌రోనాతో చేయడానికి సిద్ధ‌ప‌డాల‌ని పిలుపు నిచ్చాడు. వ్యాక్సినేషన్‌, రెమీడిసీవ‌ర్ మందుల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు మెడిక‌ల్ మాఫియా వైపు నిలిచాయ‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మాత్రం క‌రోనా క‌ట్ట‌డీ కోసం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను సైతం ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకున్నాడు. వైద్యాన్ని సామాన్యుల‌కు అందుబాటులో ఉంచ‌గ‌లిగాడు. కానీ, ఏపీ, తెలంగాణ సీఎంలు మొద‌టి, రెండో వేవ్ క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో ఘోరంగా వైఫ‌ల్యం చెందారు.ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుంద‌ని ప్ర‌పంచ మొత్తం కోడై కూస్తున్న‌ప్ప‌టికీ కేసీఆర్‌, జ‌గ‌న్ స్పంద‌న ఆశించిన మేర‌కు లేదు. పైగా రాష్ట్రాల ఆదాయం కోసం చూస్తున్నారు. ఎక్కడా క‌రోనా ఆంక్ష‌ల గురించి ప‌ట్టించుకోవ‌డంలేదు. పైగా సాప్ట్ వేర్ కంపెనీలు కూడా వ‌ర్క్ ఫ్రం హోం ప‌ద్ద‌తిని ఉప‌సంహ‌రించుకోవాలని సూచించ‌డం శోచ‌నీయం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్రాథ‌మిక జాగ్ర‌త‌ల విష‌యంలోనూ స‌ర్కార్లు ప‌ట్టించుకోవ‌డంలేదు.ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల వివ‌రాల‌ను తెలుసుకోవ‌డంలోనూ వైఫ‌ల్య‌మే. ఆదాయం గురించి ఆలోచిస్తోన్న కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ మూడో వేవ్ రూపంలో దూసుకొస్తోన్న `ఓమైక్రిన్‌` పై కూడా తొలి,రెండో విడ‌త‌లాగా వ్య‌వ‌హ‌రిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల‌ని వైద్య నిపుణుల అభిప్రాయం. చూద్దాం సీఎంలు ఏం చేస్తారో..!