వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నాటి ఓ కేసు విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కేసు పూర్వాపరాలను ఓసారి పరిశీలిస్తే.. 2016లో రోజా భర్త సెల్వమణి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన అరుళ్ అన్బరసు కలిసి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడీ పరిస్థితికి దారితీశాయి.
సెల్వమణి, అన్బరసు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి సెల్వమణి తన అభిప్రాయాలను చెప్పారు. కానీ అవి తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఈ ఇద్దరిపైనా బోద్రా.. చెన్నై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం కేసు ఫైల్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. కానీ మధ్యలో బోద్రా మృతి చెందారు. అయినా సరే.. ఈ కేసును ఆయన కుమారుడు అయిన గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు.
ఇప్పుడీ కేసు మంగళవారం మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది. కానీ ఈ విచారణకు సెల్వమణి కాని, అరుళ్ అన్బరసులు కాని, వారి న్యాయవాదులు కాని హాజరవ్వలేదు. దీంతో జార్జ్ టౌన్ కోర్టు న్యాయమూర్తి ఈ ఇద్దరిపైనా బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీచేశారు. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. సెల్వమణి.. ప్రముఖ దర్శకుడు. దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు కూడా.