Bomb Threat : తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం సాయంత్రం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మొదట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అల్వార్‌పేటలోని అధికారిక నివాసానికి బాంబు ఉంచినట్లు సమాచారం అందగా, కొద్ది సేపటికే ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నివాసానికీ ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రెండు కాల్స్ కూడా తప్పుడు (ఫేక్)వేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, భద్రతా చర్యలను అత్యంత కట్టుదిట్టం చేశారు.
చెన్నై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విఘ్నేష్ అనే వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, “సీఎం స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టాం, ఇది ఈరోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అవ్వకముందే పేలిపోతుంది” అని చెప్పినట్టు తెలిసింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ టీమ్స్‌ను సీఎం నివాసానికి తరలించి, అతి జాగ్రత్తగా మొత్తం ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. సుదీర్ఘంగా జరిగిన ఈ తనిఖీల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది తప్పుడు కాల్ అని పోలీసులు తేల్చారు. అయినా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సీఎం స్టాలిన్ నివాసం చుట్టూ భద్రతా వలయాన్ని మరింత బలపరిచారు.
Thailand – Cambodia : థాయ్‌లాండ్-కంబోడియా ఘర్షణలకు ట్రంప్ మధ్యవర్తిత్వం..?
ఇక అదే సమయంలో, చెన్నైలోని నీలంకరై ప్రాంతంలో ఉన్న నటుడు విజయ్ నివాసానికి కూడా అనుమానాస్పద కాల్ వచ్చింది. “విజయ్ ఇంట్లో బాంబు పెట్టాం” అని తెలియజేసిన ఆ ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాంబ్ స్క్వాడ్ సహాయంతో ఇంటిని పూర్తిగా పరిశీలించారు. స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఇల్లంతా సోదాలు జరిపినప్పటికీ, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ కాల్ కూడా తప్పుడు అని పోలీసులు తేల్చారు.
ఈ సంఘటనలతో చెన్నై నగరంలో ఒకింత ఆందోళన నెలకొన్నది. పోలీసులు ఈ ఫేక్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయడం ద్వారా అసలు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాల్ చేసిన వ్యక్తి విఘ్నేష్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయనను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
భద్రతా దృష్ట్యా సీఎం స్టాలిన్ నివాసం, నటుడు విజయ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచారు. ఈ తరహా తప్పుడు బెదిరింపుల వల్ల భద్రతా బలగాలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి తప్పుడు కాల్స్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు.
Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ