5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!

స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ యావత్ దేశంలో తిరంగా రెపరెపలు కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 15, 2022 / 06:00 AM IST

స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ యావత్ దేశంలో తిరంగా రెపరెపలు కనిపిస్తున్నాయి. ఈ అద్భుత తరుణంలో ఒక కొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. చండీగఢ్‌​ వాసులు ఒక వైవిధ్య ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో.. వేలాది మంది కలిసి జాతీయ జెండా ఆకారంలో మానవహారంగా నిలబడ్డారు. చండీగఢ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, NID ఫౌండేషన్‌కి చెందిన వలంటీర్లు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తన ట్విట్టర్​లో షేర్​ చేశారు. “భారతదేశానికి గర్వకారణం. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో గౌరవ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ జీ సమక్షంలో జెండా ఊపడం ద్వారా భారతదేశం గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించినందుకు సంతోషిస్తున్నాము” అని లేఖి ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఆజాదీకా అమృత మహోత్సవంలో..

ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర  దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్‌​ వాసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్‌ఐడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి,  చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్‌ సింగ్‌ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హాజరయ్యారు.