Karnataka: కర్ణాటకలో విద్వేష జ్వాలలు.. బీజేపీ వ్యూహమేంటి?

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. అందుకే అక్కడ ఎలాగైనా సరే పవర్ ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.

  • Written By:
  • Updated On - April 7, 2022 / 12:43 PM IST

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. అందుకే అక్కడ ఎలాగైనా సరే పవర్ ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. ప్రజాకర్షణ లేని బొమ్మైని పెట్టుకుని ముందడుగు వేయలేకపోతుండడంతో.. హిందుత్వ కార్డును బయటకు తీస్తోందా? కాంగ్రెస్ కూడా పుంజుకుంటుండడంతో ప్లాన్ Bని అమలు చేస్తోందా? గత రెండు నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను చూస్తుంటే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు.

రాజకీయంగా లబ్ది కోసం బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందని గత ఎనిమిదేళ్ల బీజేపీ ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది. అందుకే కర్ణాటక విషయంలోనూ అదే గేమ్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికీ కర్ణాటకలో కమలం పార్టీపై యడ్యూరప్పకే పట్టుంది. ఆయనను కాదని నిర్ణయాలు తీసుకుని గెలిచే అవకాశాలు తక్కువ. దీంతో యడ్యూరప్ప లేకపోయినా సరే.. గెలిచేలా స్కెచ్ వేసింది. అదే ఇప్పుడు అమలు చేస్తోంది.

కర్ణాటకలో హిజాబ్ తో వివాదాలు మొదలయ్యాయి. ఆ తరువాత హిందూ ఆలయ జాతరల్లో ముస్లిం వర్గాలు వ్యాపారాలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. ఆ తరువాత హలాల్ వివాదం తెరపైకి వచ్చింది. ఇక పండ్ల వ్యాపారంలో ఎక్కువగా ఉండే ముస్లింల దగ్గర మామిడిపండ్లు కొనకూడదంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపించుకోవడం మొదలైంది. అదే సమయంలో ముస్లిం వ్యాపారులకు మామిడి పండ్లు అమ్మవద్దంటూ రైతులపైనా కొందరు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇక స్కూలు పుస్తకాల్లో కూడా టిప్పు సుల్తాన్ తోపాటు మొఘలుల వైభవం గురించి ఉన్న భాగాలను తొలగించడం వంటి చర్యలు.. వివాదాలకు మూలమయ్యాయి.

బీజేపీ ఇంతగా ఆందోళన చెందడానికి మరో కారణం కూడా ఉంది. కిందటేడాది జరిగిన రెండు శాసనసభ ఉపఎన్నికల్లో ఒకదానిలో బీజేపీ గెలిస్తే.. మరోదానిలో కాంగ్రెస్ గెలిచింది. ఇది హస్తానికి, ఆ పార్టీ శ్రేణులకు మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందుకే.. వివిధ రకాల చర్యల వల్ల హిందుత్వ ఓటుబ్యాంకును ఒక్కటిగా చేసి.. తనవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీనివల్ల అటు పార్టీలో యడ్యూరప్ప ప్రాభవాన్ని తగ్గించడంతోపాటు ఇటు పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు కూడా లభిస్తుందని బీజేపీ నమ్ముతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.