Site icon HashtagU Telugu

Elections: క‌ర్ణాట‌క అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు?

Baswaraj Bommai

Baswaraj Bommai

క‌ర్ణాట‌క‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. ఏదో ఒక అంశంపై ఆందోళ‌న చేస్తూ నిత్యం ప్రజ‌ల్లో ఉండ‌డానికి congress ప్రయ‌త్నాలు చేస్తోంది. ప్రస్తుతం మేకెదాటు నీటి పారుద‌ల ప్రాజెక్టును నిర్మించాల‌ని డిమాండు చేస్తూ పాద‌యాత్ర జ‌రుపుతోంది. bjp మాత్రం అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వహించే ఆలోచ‌న‌ల్లో ఉన్నట్టు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు.

వాస్తవ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. వాస్తవానిక‌యితే అసెంబ్లీకి వ‌చ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివ‌ర్లో అంటే డిసెంబ‌రులోనే ఎన్నిక‌లు జ‌రిపితే మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబ‌రులో గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, దాంతో పాటుగా క‌ర్ణాట‌క‌కు కూడా ఎన్నిక‌లు జ‌రిపిస్తే మంచిద‌ని, ఢిల్లీ నాయ‌కులు కూడా అనుకుంటున్నట్టు స‌మాచారం.

ఒక్క క‌ర్ణాట‌క‌కే ఎన్నిక‌లు జ‌రిపితే గెల‌వ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని, అదే గుజ‌రాత్‌తో క‌లిసి నిర్వహిస్తే విజ‌యావ‌కాశాలు అధికంగా ఉంటాయ‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలోని congress లో గ్రూపు రాజ‌కీయాలు
ఎంత‌గా ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేక‌త అన్న ఒకే ఒక అంశాన్ని క్యాష్ చేసుకొని ల‌బ్ధి పొంది ఓట్లు రాబట్టుకుంటుంద‌ని అంటున్నారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక‌త మ‌రింత‌గా క‌నిపించ‌క‌ముందే ఎన్నిక‌లకు వెళ్లాల‌ని bjp నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

bjp ఈసారి పాత‌వారిని, సిట్టింగ్ ఎంపీల‌ను కాద‌ని, కొత్తవారికి టికెట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా పార్టీ ఫిరాయింపులు జ‌రిగే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఎక్కువ మంది congress వైపు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రత్యేకమైన వ్యూహంతోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.