Site icon HashtagU Telugu

Ravi Kishan : బీజేపీ ఎంపీ కి చంపేస్తామంటూ వార్నింగ్.!

Ravi Kishan Bjp

Ravi Kishan Bjp

ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఓ వ్యక్తి ఫోన్‌లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివమ్ ద్వివేది గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్‌ తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302 (హత్య), 351(3), 352 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ఎంపీని బెదిరించడమే కాకుండా, ఆయన కుటుంబసభ్యులను, మత విశ్వాసాలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై రవి కిషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “నా తల్లిని అసభ్య పదజాలంతో దూషించారు. మన ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి కూడా అవమానకరంగా మాట్లాడారు. ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు, మన ధర్మం, సంస్కృతిపై జరిగిన దాడి. అయినా నేను భయపడను. జాతీయవాదం, ధర్మం వైపే నిలబడతాను” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిని గుర్తించారు. బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా అతడిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని ఆయన సిబ్బంది కోరారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి, ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. “న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది” అని రవి కిషన్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version