Site icon HashtagU Telugu

Rajinikanth RajBhavan? బీజేపీ ఆకర్ష్.. రాజ్ భవన్ కు రజనీకాంత్!

Rajani

Rajani

ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెబినట్టే.. ఈ డైలాగ్ వినగానే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే గుర్తుకువస్తారు. అయితే విచిత్రం ఏమిటంటే.. పైన చెప్పిన డైలాగ్ రజనీకి సినిమాల్లో మాత్రమే వర్కవుట్ అయ్యింది. అదే నిజజీవితంలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యిందని చెప్పక తప్పదు. అయన గతకొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడు జనం ఎంతో ఆసక్తి ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టే రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ పలుసార్లు వాయిదా పడుతూవచ్చింది. అయన అభిమానులు సంఘాలు ఏకంగా టపాసులు కాల్చి, రజనీకి  వెల్ కం చెప్పారు. అకస్మాత్తుగా ఏమోందో ఏమో కానీ.. రజనీ ఆ మధ్య మీడియాకు ముందుకొచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘దైవ నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటాను. నేను ఇప్పట్ల్లో రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. నా రాజకీయ భవిష్యత్తు దైవ నిర్ణయమే’’ అంటూ తేల్చి చెప్పారు. సీన్ కట్ చేస్తే మరోసారి అంటే… తాజాగా రజనీకాంత్ వార్తల్లోకెక్కారు. ఆయన గవర్నర్ బాధ్యతలు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్టు మీడియాలో కథనాలొస్తున్నాయి.

అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటు పలు రాష్ట్రాల్లోనూ బీజేపీని విస్తరించాలని కంకణం కట్టుకుంది. కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని బీజేపీ బలంగా వాడుకుంటుంది. అందుకు ఉదాహరణ మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహరం. అయితే నార్త్ లో టాప్ గేర్ ఉన్నా బీజేపీ, సౌత్ విషయానికొస్తే మాత్రం చాలా వెనుకబడిపోయింది. అందుకే దక్షణాదిపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోనూ బీజేపీ పాగా వేసేందుకు వ్యూహలు రచిస్తోంది. తమిళ్ నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ గవర్నర్ పదవి కట్టబెట్టి తమిళ తంబీలను ను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది.

ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్య నేతలతో వరుసగా భేటీ అయ్యారు. పార్టీ లేదా గవర్నర్ బాధ్యతలను అప్పగించేందుకే తలైవా రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి వచ్చిన మరుసటి రోజే.. రజనీకాంత్.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. గవర్నర్‌తో భేటీ అయి రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే సంగీత దిగ్గజం ఇళయరాజాను రాజ్యసభకు పంపిన బీజేపీ, తాజాగా రజినీకాంత్ ను రాజ్ భవన్ కు పంపాలని భావిస్తోంది. రజనీ రాజ్ భవన్ కు వెళ్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే!!