Bajrang Dal Guns: కర్ణాటకలో బజరంగ్ దళ్ ఎయిర్ గన్ ట్రెయినింగ్ క్యాంప్ కలకలం, పులుముకున్న రాజకీయ రంగు.!!

కర్నాటకలోని మడికేరి జిల్లాలో బజరంగ్ దళ ఇటీవల నిర్వహించిన ఒక శిక్షణా శిబిరం వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 10:12 AM IST

కర్నాటకలోని మడికేరి జిల్లాలో బజరంగ్ దళ ఇటీవల నిర్వహించిన ఒక శిక్షణా శిబిరం వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. ఈ శిబిరంలో పాల్గొన్న 100 మందికి ఎయిర్ గన్ శిక్షణ ఇచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా పీఎఫ్‌ఐ సభ్యుడు ఇబ్రహీం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పొన్నంపేట పట్టణంలోని పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిబిరంలో ఎయిర్‌గన్‌లు వాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు ఈ విషయంపై విచారణ ప్రారంభించి, పాఠశాల మైదానాన్ని అటువంటి కార్యక్రమానికి ఉపయోగించవచ్చా లేదా అనే దానిపై విద్యాశాఖ నుండి నివేదిక కోరారు. ఇదిలా ఉంటే ఈ అంశం రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. అటు అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వాగ్వాదానికి దారితీసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తమ ప్రభుత్వం అనుమతించదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

ఆరోపణలపై జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎమ్మెల్యే సి.టి. రవి స్పందిస్తూ ఈ శిబిరం ఆత్మరక్షణ పాఠ్యాంశాల్లో భాగమని పేర్కొన్నారు. ఏకే-47లు, బాంబులు వాడేందుకు వారికి శిక్షణ ఇవ్వలేదు. బజరంగ్ దళ్ ప్రతి సంవత్సరం తన కార్యకర్తలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు.

అయితే దీనిపై శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ స్పందిస్తూ, ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు.

ఇదిలా ఉంటే మే 5 నుంచి 11 వరకు శిక్షణ శిబిరం నిర్వహించారు. అయితే తాము ఆయుధ చట్టాలను ఉల్లంఘించలేదని బజరంగ్ దళ్ పేర్కొంది. ఎయిర్ గన్‌ల వాడకం ఆయు చట్టం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఎయిర్ గన్‌లను వినియోగించడం నిశేధం ఉందని, దీనిపై విచారణ జరుపుతున్నామంటూ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే మడికేరి జిల్లాలోని పాఠశాల ఆవరణలో తుపాకులతో ఆయుధ శిక్షణ ఇస్తున్న బాధ్యులను అరెస్ట్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మడికేరిలో యువ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇవ్వడం ద్వారా బజరంగ్ దళ్ మన దేశ చట్టాన్ని సవాలు చేసిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటకలో హోం మంత్రి లేదా విద్యా శాఖ మంత్రి ఉన్నారా? ప్రభుత్వం ఇంకా బతికే ఉందా?” అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఆయుధ శిక్షణ చట్ట విరుద్ధమని, భజరంగ్ దళ్ నాయకులపై హోంమంత్రి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.