కేరళలో బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం రేపుతోంది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఫ్లూ పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాపించే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు ఉన్న కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులు చంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు.
కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. ఈ సమాచారం మేరకు ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలో మీటర్ పరిధిలో సుమారు 8,000 బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు అర్పుకర, తాళయాళం పంచాయతీల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించారు.
స్థానిక సంస్థలు, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటర్ పరిధిలో పక్షులను చంపి నాశనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిసెంబర్ 13 నుండి మూడు రోజుల పాటు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుండి 10 కి.మీ పరిధిలో కోడి, బాతు, ఇతర దేశీయ పక్షులు, గుడ్లు, మాంసం, పేడ విక్రయం, రవాణా నిషేధించబడింది. అలాగే వ్యాధి కేంద్రానికి 10 కి.మీ పరిధిలోని 19 స్థానిక సంస్థల పరిధిలో కోడి, బాతు, ఇతర పెంపుడు పక్షులు అసాధారణంగా చనిపోతే సమీపంలోని పశువైద్యశాలకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హెచ్5ఎన్1 జాతికి వలస, సముద్ర పక్షులు వాహకాలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Raping Stepdaughter: రాజస్థాన్‌లో దారుణం.. సవతి కూతురి మీద తండ్రి అత్యాచారం
అర్పుకరలోని డక్ ఫామ్‌లో, థాలయాజంలోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్‌లో పక్షులు మరణించిన తర్వాత, నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబొరేటరీకి పరీక్ష కోసం పంపారు. వాటికీ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని తెలిపారు. బాధిత పంచాయతీల్లో పక్షులను చంపి వాటిని నాశనం చేసేందుకు పశుసంవర్థక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.