Quran In Temple: ఖురాన్ పఠనంతో.. రథోత్సవానికి శ్రీకారం.. ఎక్కడ.. ఎలా ?

ఓవైపు కర్ణాటకలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపు వ్యాఖ్యలు పెరిగిపోతున్న తరుణంలో..

Published By: HashtagU Telugu Desk
Belur Imresizer

Belur Imresizer

ఓవైపు కర్ణాటకలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపు వ్యాఖ్యలు పెరిగిపోతున్న తరుణంలో.. మరోవైపు అదే గడ్డపై ఒకచోట మత సామరస్యం పరిమళించింది. హిందూ, ముస్లిం సోదరభావం ఇకపైనా కొనసాగుతుందనే సందేశం వెలువడింది. ఈ చారిత్రక ఘట్టానికి కర్ణాటకలోని బేలూరు పట్టణం వేదికగా నిలిచింది. అక్కడున్న ప్రఖ్యాత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా రథోత్సవాన్ని ప్రారంభించడానికి ముందు..

ముస్లిం మౌల్వీలు వచ్చి ఖురాన్ ను పఠించడం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఖురాన్ పఠణానికి అనుమతి ఇవ్వకూడదని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ కూడా తొలుత అంగీకరించింది. రథోత్సవం వేళ ఆలయ పరిసరాల్లో ముస్లిం వ్యాపారులు దుకాణాలు కూడా పెట్టుకోరాదని నిర్దేశించింది. కానీ కర్ణాటక దేవాదాయ శాఖ జోక్యంచేసుకొని అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారమే.. ముస్లిం మౌల్వీలతో ఖురాన్ ను చదివించాకే రథోత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించింది.

ఉత్సవం సందర్భంగా హిందూయేతర వర్గాలు కూడా స్టాళ్లు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయం వేదికగా.. మత సామరస్యం నైతిక విజయాన్ని సాధించినట్టు అయింది. హిందూ, ముస్లిం భాయ్.. భాయ్ అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెన్నకేశవ స్వామి ఆలయ రథోత్సవ కార్యక్రమం నిలిచింది. యావత్ దేశానికి భిన్నత్వంలో ఏకత్వపు సందేశాన్ని పంపింది.

  Last Updated: 15 Apr 2022, 09:49 AM IST