Site icon HashtagU Telugu

Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!

Palmyra Palm Trees

Palmyra Palm Trees

పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్‌ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం.

మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అయితే ఇప్పుడు అదే తమిళనాడు.. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుం బిగించింది. మరిన్ని తాటి చెట్లను పెంచే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంలో 5.2 కోట్లకు పైగా తాటి చెట్లు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా తాటి చెట్లలో సగం తమిళనాడులోనే ఉండటం విశేషం. తాజాగా గ్రీన్ తమిళనాడు మిషన్ కింద తాటి చెట్ల పెంపకాన్ని ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం భారీగా పెంచింది. ఇక ఈ తాటి చెట్టు తమిళనాడు రాష్ట్ర వృక్షం కావడం మరో విశేషం.

తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ తమిళనాడు మిషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో తాటి చెట్లను నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మిషన్ ద్వారా 2.24 కోట్లకు పైగా తాటి విత్తనాలను నాటారు. ఈ కార్యక్రమంలో 16,600 మందికి పైగా వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, అరియలూర్, తిరుపత్తూరు, శివగంగై జిల్లాల వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో 10 లక్షలకు పైగా తాటి విత్తనాలను నాటారు.

ఈ తాటి చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక ఒక్కో తాటి చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు.. నదీ తీరాలు, తీర ప్రాంతాలు, పొడి భూములను బలోపేతం చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయి. అలాగే భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి సహాయపడటంలో ఈ తాటి చెట్లు కీలకంగా పనిచేస్తాయి.

ఈ కార్యక్రమం తమిళనాడు రాష్ట్రానికి పర్యావరణపరంగానే కాకుండా.. సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రయోజనకరమని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నారు. ఈ తాటి చెట్ల పెంపకాన్ని గ్రీన్ తమిళనాడు మిషన్, ఉధావి యాప్‌ల ద్వారా జియో ట్యాగింగ్‌ చేసి.. పర్యవేక్షిస్తున్నారు. ఈ తాటి చెట్లు నేల కోతను నివారించడంతోపాటు.. నీటి వనరులను పెంచడం, వాతావరణ మార్పులను తట్టుకోవడం వంటి పర్యావరణ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

అంతేకాకుండా నుంగు, పానీర్, కరుపట్టి వంటి ఉత్పత్తుల ద్వారా అనేక జీవనోపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. “ప్రతి గ్రామంలో తాటి చెట్టును చూద్దాం.. పచ్చని తమిళనాడును చూద్దాం!” అనే నినాదంతో కొనసాగుతున్న ఈ ప్రజా ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించదగిన పర్యావరణ నమూనాగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. దేశంలోని తాటి చెట్ల సంఖ్యలో సగం తమిళనాడులోనే ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్రంలో తాటి చెట్ల నుంచి కల్లు తీయడంపై నిషేధం ఉంది. 1987 జనవరి 1 నుంచి తమిళనాట కల్లు గీతపై నిషేధం అమల్లో ఉంది. అంతకు ముందు నిషేధం ఉన్నప్పటికీ.. పలు సందర్భాల్లో నిషేధించడం, నిషేధాన్ని తొలగించడం లాంటివి చేశారు. తాటి కల్లు తాగడం వల్ల ప్రజారోగ్యం పాడవుతుందని, కల్లును కల్తీ చేయడం వల్ల మరణాలు సంభవిస్తాయనే కారణంతోపాటు.. మద్యం ద్వారా సమకూరే ఆదాయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని గీత కార్మికులు ఈ నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణలో కల్లు తాగడం పట్ల జనాలు చాలా ఆసక్తి చూపిస్తారు. కల్లు ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. కానీ తమిళనాట తాటి చెట్లు విపరీతంగా ఉన్నప్పటికీ.. కల్లుగీతపై నిషేధం ఉండటం గమనార్హం.

Exit mobile version