Site icon HashtagU Telugu

Karnataka: భజరంగ్ దళ్ కార్యకర్త.. హ‌ర్ష దారుర‌ణ‌ హత్య..!

Bajrang Dal Activist Murder

Bajrang Dal Activist Murder

కర్ణాటకలో హిజాబ్ వివాదం మరో టర్న్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగురున్న అందోళనలకు, హిజాబ్ నిరసనలకు ఎలాంటి సంభందం లేదని చెబుతోంది. ఆదివారం రాత్రి కర్ణాటకలోని శివమొగ్గలో హర్ష అనే 23 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. ఆయనను దగ్గరలోని మెక్‌గన్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ విషయంపై మాట్లాడుతూ హర్ష హత్యలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. ఆ ఐదుగురిలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసారు.

హర్ష మరణంపై శివమొగ్గలో నిరసనలు హింసాత్మకంగా మారాయి, నిరసనకారులు రాళ్లు రువ్వడం, వాహనాలను తగలబెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. రోడ్లపైకి వచ్చే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహాయంతో హర్ష మృతదేహాన్ని దహన సంస్కారాలకు తరలించారు. హర్ష అంతిమయాత్రలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప, స్థానిక ఎమ్మెల్యే, శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సంఘటనపై ఇప్పటివరకు జరిగిన టాప్ 10 డెవలప్‌మెంట్‌లు:

1. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటకలోని శివమొగ్గలో 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు. శివమొగ్గలో 1,200 మంది పోలీసులను మోహరించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మరో 400 మంది అదనపు సిబ్బందిని జిల్లాకు తరలించారు.

2. ప్రజలందరూ సంయమనం పాటించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, దీనికి బాధ్యులైన వారిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని, శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు అధికారులకు సూచించారు.

3. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రస్తుతం కొనసాగుతున్న హిజాబ్ వివాదానికి హర్ష మృతికి సంబంధం లేదని అన్నారు. అయితే, దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి తెలిపారు.

4. హర్ష మృతిపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కర్ణాటక సీఎంను కోరారు.

5. ఈ హత్యలో ముస్లిం గూండాల ప్రమేయం ఉందని, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ముస్లిం గూండాలను రెచ్చగొట్టారని కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఆరోపించారు.

6. మంత్రి ఈశ్వరప్ప ఆరోపణలను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొట్టిపారేశారు. మంత్రి ఈశ్వరప్ప దేశానికి, జాతీయ జెండాకు అవమానం కలిగించారని, ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి, మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని శివకుమార్ డిమాండ్ చేసారు.

7. కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. హర్ష హంతకులకు ఉరిశిక్ష విధించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.

8. హిజాబ్ వ్యతిరేక నిరసనలో పాల్గొనడం వల్లే హర్ష హత్యకు గురయ్యాడని బీజేపీ నేత బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు.

9. రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగాలని కాంగ్రెస్, బీజేపీలు కోరుకుంటున్నాయని జనతాదల్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో శాంతిభద్రతలను డిస్టర్బ్ చేసేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

10. కర్నాటక ప్రభుత్వం మృతుల కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించించింది.