Vande Bharat Train: వందే భార‌త్ ట్రైన్‌కు బ‌దులుగా మ‌రో ట్రైన్‌.. ట్విట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వెలుబుచ్చిన ప్ర‌యాణికుడు ..

వందే భార‌త్ పేరుతో మ‌రో రైలు రావ‌డంతో సిద్ధార్ద పాండే షాక‌య్యాడు. అందులో టాయిలెట్ అద్వాన్నంగా ఉంది, బోగీలోనూ అసౌక‌ర్యంగా ఉంది. దీంతో త‌న ఆవేద‌నను సిద్ధార్ద పాండే ట్విట్ట‌ర్ వేదిక‌గా వెలుబుచ్చాడు.

  • Written By:
  • Updated On - June 19, 2023 / 07:27 PM IST

దేశ వ్యాప్తంగా వందే భార‌త్ (Vande Bharat)  రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) ఇప్ప‌టికే ప‌లు రూట్ల‌లో వందే భార‌త్ రైళ్ల‌ను ప్రారంభించారు. ఈ రైలులో ప్ర‌యాణిస్తే గ‌మ్య స్థానానికి వేగంగా చేరుకోవ‌టంతో పాటు, ల‌గ్జ‌రీ ప్ర‌యాణం చేయొచ్చు. దీంతో దూర ప్రాంతాల‌కు వెళ్లేవారు వందే భార‌త్ రైళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఢిల్లీకి చెందిన సిద్ధార్ధ పాండే ఈనెల 10న న్యూఢిల్లీ నుంచి శ్రీ‌మాతావైష్ణోదేవి క‌త్రా మ‌ధ్య న‌డిచే వందే భార‌త్ రైలులో ప్ర‌యాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. మిగిలిన రైళ్ల కంటే వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్ ధ‌ర‌లు కాస్త ఎక్కువే. కాస్త టికెట్ ధ‌ర ఎక్కువే అయినా వందే భార‌త్‌లో ప్ర‌యాణించేందుకు సిద్ధార్ధ పాండే సిద్ధ‌మ‌య్యాడు. తొలిసారి వందే భార‌త్ రైలు ఎక్కుతుండ‌టంతో ఉత్సాహంగా ఉన్నాడు.

ప్లాట్‌ఫాం వ‌ద్ద‌కు వెళ్లి రైలుకోసం కొద్దిసేపు వేచిచూడ‌గా వందే భార‌త్ రైలు వ‌చ్చింది. ఆ రైలును ఎక్కిన త‌రువాత అది వందే భార‌త్ రైలు కాద‌ని గుర్తించాడు. తాను వేరే రైలు ఎక్కానేమోన‌ని ఆందోళ‌న చెంద‌గా.. రైలులోని మిగ‌తా ప్ర‌యాణికులు ఇది వందేభార‌త్ రైలే అని చెప్పారు. ఆ రైలులో క‌నీసం సౌక‌ర్యాలు కూడాలేవు, టాయిలెట్ అద్వాన్నంగా ఉంది. దీంతో సిద్ధార్ధ పాండేకు చిర్రెత్తుకొచ్చింది. టాయిలెట్, రైలు బోగీలో అసౌక‌ర్యంగా ఉండ‌టంతో వాటిని వీడియోలు తీసి త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. ట్వీట్‌కు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని ట్యాగ్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ వైర‌ల్ అయింది.

సిద్ధార్ద‌ పాండే త‌న ట్వీట్‌లో ఇలా రాశాడు.. వందే భార‌త్ రైలులో తొలిసారి ఎక్కేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అయితే, వందే భార‌త్ పేరుతో మ‌రో రైలు రావ‌డం చూసి షాక‌య్యాను. ఆ రైలుకు బ‌దులు తేజ‌స్ ఎక్స్ ప్రెస్ రైలు వ‌చ్చింది. అందులో టాయిలెట్ అద్వాన్నంగా ఉంది, బోగీలోనూ అసౌక‌ర్యంగా ఉంది. ఈ మాత్రం ప్ర‌యాణానికి టికెట్‌కు పెద్ద‌మొత్తంలో రైల్వే వారు వ‌సూళ్లు చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. సిద్ధార్ధ పాండే ట్వీట్‌కు నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. రైల్వే శాఖ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టంతో పాటు, సెటైర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. చివ‌రికి రైల్వే సేవ ట్విట‌ర్ హ్యాండిల్ ద్వారా రైల్వే సిబ్బంది స్పందించారు. సిద్ధార్ధ‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. పై అధికారుల‌కు స‌మాచారం ఇస్తామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.