Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్ కాదని ఇన్సూరెన్స్ కంపెనీలు గట్టిగా అనుమానించడంతో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
కుటుంబ సభ్యుల వద్ద నుంచి డబ్బులు కొట్టేసేందుకు ముఖ్యంగా వారిని చంపితే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున సినిమాల్లో, కొన్ని సార్లు నిజ జీవితాల్లోనూ చూశాం. అయితే ఎక్కువ మంది ఆ డబ్బుల కోసం.. రోడ్డు ప్రమాదం జరిపడం మనకు తెలుసు. కానీ తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఇలాంటి హత్యే చేశారు కన్నకొడుకులు. ముఖ్యంగా తమకు జన్మను ఇచ్చిన తండ్రినే.. రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పాముతో కరిపించి మరీ చంపేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోతటూర్‌పేటకు చెందిన 56 ఏళ్ల గణేష్.. ఒక ప్రభుత్వ సంస్థలో లాబొరేటరీ అసిస్టెంట్‌గా పని చేసేవారు. అక్టోబర్ 22వ తేదీన ఆయన తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మెడపై పాము కరిచి మరణించారు. నిద్రలోనే పాము కాటుకు గురికావడంతో అది సహజంగా జరిగిన ప్రమాదమని అందరూ భావించారు. కుటుంబ సభ్యులు కూడా విషాదంలో ఉన్నట్లు నటించడంతో ఎవరికీ అనుమానం రాలేదు.
ఇన్సూరెన్స్ కంపెనీల ఫిర్యాదుతో మలుపు!
గణేష్ మరణించిన కొద్దిరోజులకే ఆయన పేరు మీద ఉన్న 11 వేర్వేరు ఇన్సూరెన్స్ పాలసీల క్లెయిమ్ కోసం దరఖాస్తులు వెళ్లాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 3 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో పాలసీలు ఉండటం, పైగా ఆయన మరణించడానికి కొన్ని వారాల ముందే ఒక రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమానం కలిగించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్ డేటా రికార్డులను పరిశీలించగా అసలు కుట్ర బయటపడింది. గణేష్ ఇద్దరు కుమారులు తమ తండ్రిని వదిలించుకుని, ఆ బీమా సొమ్మును చేజిక్కించుకోవాలని పథకం వేశారు. అందుకోసం వారు పాములను పట్టే వ్యక్తుల సహాయం తీసుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న తండ్రి మెడపై పట్టుకొచ్చిన పామును వదిలి కరిపించారు. ఆ విషం ఒంట్లోకి పాకడంతో గణేష్ నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అయితే నిందితులు పాము పట్టే వారితో పదేపదే మాట్లాడినట్లు, అలాగే పామును తరలించినట్లు సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.
ఈక్రమంలోనే గణేష్ ఇద్దరు కుమారులతో పాటు పామును సరఫరా చేసిన వారు, ఈ కుట్రలో సహకరించిన మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్య, మోసం, కుట్ర కేసులు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
