ఆంధ్రప్రద్రేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారింది.. జగన్ పై పవన్ ఫైర్!

తెలుగు నేల రెండుగా చీలిపోయినా.. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి సమస్యలు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందులో మొదటిది డ్రగ్స్ రవాణా. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 02:07 PM IST

తెలుగు నేల రెండుగా చీలిపోయినా.. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి సమస్యలు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందులో మొదటిది డ్రగ్స్ రవాణా. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో లెక్కకుమించి గంజాయి నిల్వలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినా.. మొదటగా ఏపీనే అనే వెలెత్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ డ్రగ్స్ పై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ఈ విషయం గురించి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. జనసేన రాజకీయ పార్టీ తరపున నిర్వహించిన ‘పోరాట యాత్ర’లో తన అనుభవాలను పంచుకున్నారు. 2018లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల ప్రజల సామాజిక-ఆర్థిక సమస్యలను అర్థం చేసుకునేందుకు పోరాట యాత్ర చేశానని, ఆరోగ్యం, నిరుద్యోగం, పలు సమస్యలపై ఫిర్యాదులు అందాయని అన్నారు. అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, దాని మాఫియా గురించి కూడా అనేక ఫిర్యాదు అందాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ మాఫియా వల్ల అమాయక గిరిజన ప్రజలు, యువకులు బలవుతున్నారని అన్నారు. ఆంధ్రప్రద్రేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని, ఫలితంగా వేలాదిమంది మత్తు పదార్థాలకు వ్యసనపరులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు సైతం ఏపీని కారణంగా చూపుతున్నారని అన్నారు. ‘‘గంజాయి మూలాలు ఏఓబీ (ఆంధ్రా ఒరిస్సా బోర్డర్) ఉన్నాయి, అక్కడ్నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతోంది. దీంతో వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఫైనాన్సర్లు, బ్రోకర్లు, రైతులు, స్థానిక నాయకులతో ఈ దందా నడిపిస్తున్నారు’’ అంటూ నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ట్విట్టర్లో పేర్కొన్న విషయాలను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు.

 

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, ఏపీలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేసిన కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాష్ట్రంలో సుమారు 2,500 ఎకరాల్లో రూ.8 వేల కోట్ల విలువైన గంజాయి సాగు చేస్తున్నారని, దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.