మ‌హాపాద‌యాత్ర వెనుక షాడో ఎవ‌రు?

ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌కుండా అమ‌రావ‌తి రైతులు ఏమి చేయ‌గ‌ల‌రు? ఒక వేళ మ‌హాపాద‌యాత్ర‌కు వెళితే..రైతులకు భ‌ద్ర‌త ఎవ‌రు క‌ల్పిస్తారు?

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 12:20 PM IST

ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌కుండా అమ‌రావ‌తి రైతులు ఏమి చేయ‌గ‌ల‌రు? ఒక వేళ మ‌హాపాద‌యాత్ర‌కు వెళితే..రైతులకు భ‌ద్ర‌త ఎవ‌రు క‌ల్పిస్తారు? పంతానికి పోతే ప్రమాదం ఎవ‌రికి? ప్ర‌భుత్వానికా? రైతుల‌కా? అమ‌రావ‌తి రైతులు త‌ల‌పెట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానంకు మ‌హాపాద‌యాత్ర ఏం కాబోతుంది? ఇదే ఏపీలోని హాట్ టాపిక్‌.
అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు మ‌హాపాద‌యాత్ర‌కు పూనుకున్నారు. అందుకోసం పోలీస్ అనుమ‌తి కోరుతూ అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి కో ఆర్డినేట‌ర్ తిరుమ‌ల‌రావు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు విజ్ఞ‌ప‌న ప‌త్రం అందించాడు.
రాష్ట్రంలోని ప‌రిస్థితుల దృష్ట్యా పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని తిరుగు స‌మాధానం డీజీపీ కార్యాల‌యం ఇచ్చింది. దాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన రైతులు ఎట్ట‌కేల‌కే పాద‌యాత్ర‌కు అనుమ‌తి పొందారు. కానీ, ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు స‌హ‌కారం అందించ‌క‌పోతే..ఏపీలో ప్ర‌తిచోటా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అప్పుడు లా అండ్ ఆర్డ‌ర్ స‌క్ర‌మంగా లేద‌నే అప‌వాదు ప్ర‌భుత్వం మీద వ‌స్తుంది. ఆ ల‌క్ష్యంతోనే రైతులు మ‌హాపాద‌యాత్ర‌కు పునుకున్నారా? లేక రైతుల ల‌క్ష్యం మ‌ళ్లీ రాజ‌ధాని అంశాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్ల‌డ‌మా? అనే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.
తొలి నుంచి రాజ‌ధాని రైతులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ల‌ని వైసీపీ భావిస్తోంది. పైగా అక్క‌డ ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని కొన్ని రోజులు, ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు అక్క‌డ భూములు కొనుగోలు చేశార‌ని మ‌రికొన్ని రోజులు, కృష్ణా న‌ది భవిష్య‌త్ లో రాజ‌ధానిని ముంచేస్తోంద‌ని కొన్ని రోజులు..సామాజికంగా ఆలోచిస్తే మూడు రాజ‌ధానులు ఉండాల‌ని ప్ర‌భుత్వం వాద‌న‌ల‌ను వినిపించింది. ఆ మేర‌కు అసెంబ్లీ తీర్మానం చేసింది.
అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. అంతిమ తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఎలాంటి కార్యాల‌యాలు త‌ర‌లించ‌డానికి లేద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలును భావిస్తూ కొన్ని ఆఫీస్ ల‌ను ప్ర‌భుత్వం త‌ర‌లించింది. ప‌రిపాల‌న రాజ‌ధాని వైజాగ్ లో నూత‌న భ‌వ‌న నిర్మాణాలు పూర్త‌య్యాయి. శాస‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆగిపోయిన నిర్మాణాల‌ను తిరిగి పున‌రుద్ద‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.
ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్రకు పూనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌ధాని అంశాన్ని నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంచ‌డానికి మ‌హా పాద‌యాత్రను ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ చేప‌ట్టింది. ఇదంతా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని శాంతిభ‌ద్ర‌త‌ల‌ను భ‌గ్నం చేయ‌డానికి చేస్తోన్న ప్ర‌య‌త్నంగా ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో కోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ రైతులు మ‌హా పాద‌యాత్ర ఎలా చేస్తారో..చూద్దాం.!