Amit Shah – Tamilisai : తమిళిసైపై అమిత్‌షా సీరియస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఘటన

ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 03:02 PM IST

Amit Shah – Tamilisai : ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పక్కపక్క కుర్చీల్లో ఆసీనులయ్యారు. అప్పుడే వేదికపైకి వచ్చిన తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ వారిద్దరికి నమస్కరించారు. అమిత్‌‌షా, వెంకయ్య నాయుడు నవ్వుతూ ప్రతి నమస్కారం చేశారు. వారిని దాటుకుని తమిళిసై ముందుకు వెళ్లబోతుండగా.. ఆమెను అమిత్ షా పిలిచారు. దీంతో ఆమె వెంటనే అమిత్ షా వద్దకు వచ్చారు. ఈక్రమంలో తమిళిసైను అమిత్ షా సీరియస్‌గా ఏదో మందలించారు. వేలు చూపుతూ కోపంగా మాట్లాడారు. ఈ సీన్లు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకొని మరీ అమిత్‌ షా(Amit Shah – Tamilisai) ఆమెను ఏదో వారించినట్లు అందులో కనిపిస్తోంది. తనకు ఎలాంటి సంజాయిషీలు చెప్పొద్దంటూ ఆయన చేతులను అడ్డంగా ఊపడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join

తమిళిసైకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు మధ్య జరిగిన  మాటామంతి ఏమిటి ? అది వాగ్వాదమా ? అనే దానిపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. తమిళిసై పై అమిత్ షా అంతగా ఎందుకు సీరియస్ అయ్యారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం వల్లే తమిళిసైని షా మందలించి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ రాష్ట్రంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అన్నామలైకి వ్యతిరేకంగా తమిళిసై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పంచాయితీలు పెట్టొద్దని, అన్నామలైతో కలిసి ముందుకు సాగాలని తమిళిసైకి అమిత్ షా హితవు పలికి ఉంటారని అంచనా వేస్తున్నారు. వారిద్దరి సంభాషణను పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు, వెనకాలే కూర్చున్న కేందమంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆసక్తిగా  విన్నారు.

తమిళిసై వర్సెస్ అన్నామలై 

తమిళిసై అమిత్ షా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే ఆమె పార్టీ అధిష్ఠానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖలో అసాంఘిక శక్తులు కీలక పోస్టులను పొందుతున్నారని తమిళిసై కామెంట్ చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలైని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే తో బీజేపీ పొత్తు విషయానికి సంబంధించి కూడా అన్నామలై, తమిళి సై మధ్య విబేధాలు తలెత్తాయి. అన్నామలై కారణంగానే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని ఇటీవల అన్నా డీఎంకే మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి వ్యాఖ్యానించారు.  వేలుమణి వాదనను అన్నామలై కొట్టివేయగా, తమిళిసై సమర్ధించారు.