Kerala: కేరళ గవర్నర్‭కు బిగ్ షాక్.. ఆ పదవి నుంచి తొలగింపు..!

విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్‌ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 11:33 PM IST

విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్‌ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ స్థానంలో నిపుణుడిని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని లెఫ్ట్‌ ప్రభుత్వం, గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మధ్య గత కొద్దిరోజులుగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఖాన్ స్థానంలో కళ, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని నియమించడానికి విశ్వవిద్యాలయ నిబంధనలను మారుస్తున్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధి అనే విషయం తెలిసిందే. రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పడటంలేదు. వైస్ ఛాన్సలర్ల నియామకం సహా యూనివర్సిటీల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. బుధవారం కేరళ ప్రభుత్వం గవర్నర్ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా నియమించాలని ప్రత్యేక ఉత్తర్వులు వస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, బిజెపిలు వ్యతిరేకించాయి.

డీమ్డ్ యూనివర్శిటీ పాలనా వ్యవస్థ, నిర్వహణ నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించాలని కేరళ కళామండలం సవరించిన నియమాలు చెబుతున్నాయి. ఛాన్సలర్ పదవీకాలానికి సంబంధించిన నిబంధనను కూడా సవరించారు. కొత్త రూల్ ప్రకారం ఐదేళ్ల పదవి కాలంతో పాటు రెండవసారి కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ ప్రభావం లేని మూడు దక్షిణాది రాష్ట్రాల్లోని గవర్నర్లతో అక్కడి ప్రభుత్వాల మధ్య ఘర్షణ సాధారణ విషయంగా మారింది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఉపసంహరించుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‭ను తొలగిస్తూ పినరయి ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించింది. ఇక తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సంబంధాల గురించి మనకు తెలిసిందే.