No Toilet, Bride Hangs Self: అత్తారింట్లో మరుగుదొడ్డి కట్టలేదని.. పెళ్లయిన నెలలోపే ఉరి వేసుకున్న నవ వధువు!

ఇంట్లో మరుగుదొడ్డి కచ్చితంగా ఉండాలి. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 10:34 AM IST

ఇంట్లో మరుగుదొడ్డి కచ్చితంగా ఉండాలి. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దీనిపై ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. తమిళనాడులో జరిగిన దుర్ఘటనే దీనికి ఉదాహరణ. 27 ఏళ్ల రమ్య.. తను ఇష్టపడ్డ, ప్రేమించిన కార్తికేయన్ నే పెళ్లి చేసుకుంది. కానీ అత్తారింట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో కట్టించమని అడిగింది. అతడు కాదనేసరికీ ఏకంగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

కడలూరు అరిసిపెరియాన్ కుప్పానికి చెందిన రమ్య ఎమ్మెస్సీ చదివింది. మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. కార్తికేయన్ ను రెండేళ్లుగా ప్రేమించింది. ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 6న పెళ్లి జరిగిన తరువాత రమ్య అత్తారింటికి కాపురానికి వెళ్లింది. కానీ ఆ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో అసౌకర్యంగా భావించింది. దీంతో అదే ఊళ్లో టాయిలెట్ ఉన్న మరో ఇంటికి మారదామని భర్తను అడిగింది.

రమ్య కోరిక సమంజసమైనది. పైగా అది ఆమె ఆత్మగౌరవానికి సంబంధించింది. అయినా దానిని ఆమె భర్త కార్తికేయన్ ఏమాత్రం అర్థం చేసుకోలేదు. పైగా అందరిలా బహిర్భూమికి వెళ్లాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో రమ్య మనసు చివుక్కుమంది. మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో అక్కడ ఉండలేక బాధతో పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తరువాత తానే చొరవ తీసుకుని భర్తకు ఫోన్ చేసింది.

మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారదామని రమ్య తన భర్త కార్తికేయన్ ను ఫోన్ ద్వారా బతిమిలాడింది. కానీ అతడు మాత్రం ససేమిరా అన్నాడు. అందరిలా బహిర్భూమికి వెళ్లాల్సిందే అని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య ఆ ఆవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీసింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. భార్యా ఇష్టాయిష్టాలను కూడా
గౌరవించలేడా అని స్థానికులు కార్తికేయన్ పై విరుచుకుపడుతున్నారు.

పెళ్లయిన కొద్ది రోజులకే కన్న కూతురు ఉరికొయ్యకు వేలాడడాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో రమ్య తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుగుదొడ్డి లేదన్న కారణంతో నవ వధువు ఇలా సూసైడ్ చేసుకోవడంపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.