Site icon HashtagU Telugu

TN Politics: పన్నీర్ గ్రూప్ కి చెక్ పెట్టేలా పళని వర్గం వ్యూహం.. వైద్యలింగం మద్దతుదారులకు గాలం

Tamimlnadu Politics

Tamimlnadu Politics

తమిళనాడులో రెండాకుల పార్టీ అయిన అన్నాడీఎంకే రెండుగా చీలిపోతుందని అనుకున్నా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈపీఎస్ Vs ఓపీఎస్ గా ఉన్న రాజకీయం ఇప్పుడు ఏకపక్షంగా ఈపీఎస్ వైపే మొగ్గుచూపుతున్నట్టుంది. ఎందుకంటే.. పన్నీర్ సెల్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్న వైద్యలింగంతోపాటు మరికొంతమందిని ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఆకర్షించింది.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైద్యలింగం ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే డెల్టా ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టుంది. నిజానికి ఆయన ఒకప్పుడు పళనిస్వామి వర్గమే. కానీ ఆ వర్గంలో ఉన్న ఎస్పీ వేలుమణితో ఆయనకు పడదు. అందుకే ఆయన పన్నీర్ సెల్వం వర్గానికి మద్దతిస్తున్నారు. దీంతో వైద్యలింగానికి వెన్నుదన్నుగా ఉన్న వివిధ నాయకులను ఈపీఎస్ వర్గం తనవైపు లాక్కునే ప్రక్రియ చేపట్టింది. ఇక వేరే దారిలేక వైద్యలింగం కూడా అటువైపే వెళితే.. అది పన్నీర్ సెల్వం గ్రూప్ కి పెద్ద దెబ్బే.

జూలై 11న జరిగే సర్వసభ్య సమావేశానికి ముందే ఓపీఎస్ క్యాంపును ఖాళీ చేయించడానికి ఈపీఎస్ వర్గం చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తోంది. దానికన్నా ముందు ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి, కోశాధికారి పదవి నుంచి తప్పించడానికి స్కెచ్ వేసింది పళని వర్గం. ఎందుకంటే ఆయన కోశాధికారిగా ఉంటే.. డబ్బుల వ్యవహారాలకు సంబంధించి ఆయన సంతకం కచ్చితంగా కావాలి. అందుకే ఆ పోస్టు నుంచి తప్పించడానికి స్కెచ్ వేసింది.

పన్నీర్ సెల్వం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దలనే నమ్ముకుని ఉన్నారు. వాళ్లే తనకు న్యాయం చేయగలరని.. తనను అన్నాడీఎంకే చీఫ్ గా చేస్తారన్న గంపెడాశతో ఉన్నారు. మరి ఆయన ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.