నీట్ పరీక్ష రద్దు అంశంలో ప్రజలను మోసగిస్తున్న డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నాడీఎంకే (AIADMK) పార్టీ డిమాండ్ చేసింది. రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో శుక్రవారం సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. మొత్తం 375 మంది కార్యవర్గ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో 16 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర నిర్వాహకులు కేపీ మునిస్వామి, నత్తం విశ్వనాధన్, ఎస్‌పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్, మాజీ మంత్రులు సెంగోటయ్యన్, డి. జయకుమార్ తదితరులు వివిధ తీర్మానాలను సభలో ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో పార్టీని బలోపేతం చేస్తూ మెగా కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్న ఈపీఎస్‌ను సభ అభినందించింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రజలకు ఇచ్చిన 525 హామీల్లో 15 శాతం కూడా పూర్తిగా నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేసిందని ఆక్షేపించింది. నీట్ రద్దుపై డీఎంకే కపటంగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతూ, వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
15వ తీర్మానంలో, పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్, జయలలిత సిద్ధాంతాలను అనుసరిస్తూ, ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్న ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ను మళ్లీ 2026లో ముఖ్యమంత్రి కావాలని కోరుతూ — ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్న ఆహ్వానం ఇచ్చింది.