14 Years of Struggle : భర్త, కుటుంబం వదిలేసినా.. కష్టపడి పోలీస్ అయిన ఓ అమ్మ

కేరళకు చెందిన అన్నీ శివ, ఆమె పసిబిడ్డను రోడ్డు మీదకు ఈడ్చి పడేసింది ఆమె కుటుంబం. అప్పుడు శివ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. కాని, శివ జీవితం అక్కడితో ముగిసిపోలేదు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 11:54 AM IST

కేరళకు చెందిన అన్నీ శివ, ఆమె పసిబిడ్డను రోడ్డు మీదకు ఈడ్చి పడేసింది ఆమె కుటుంబం. అప్పుడు శివ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. కాని, శివ జీవితం అక్కడితో ముగిసిపోలేదు. 14 ఏళ్ల పాటు పోరాడి, తాను అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఎస్సైగా ఎదిగింది. వర్కలా పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.కేరళలోని కంజీరాంకులంలో ఉన్న కేఎన్ఎం ప్రభుత్వ కాలేజీలో సోషియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే అన్నీ శివ ప్రేమలో పడింది. అప్పటికి శివ వయసు 18 ఏళ్లు. ఎన్నో ఆశలతో, పెద్దలను ఎదురించి మరీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండేళ్లు కాపురం చేసి ఓ కొడుకును కన్న తరువాత.. శివ భర్త వీళ్లిద్దరినీ వదిలించుకున్నాడు. 8 నెలల పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్తే.. అక్కడ కూడా ఎవరూ అక్కున చేర్చుకోలేదు. దీంతో చంటి బిడ్డతో ఒంటరిగానే జీవితం అనే సముద్రాన్ని ఈదడం మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడింది. కేవలం బతకడం కాదు.. ఏకంగా సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా ఎదిగి ఎంతోమంది ఆడవాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.

మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం రెండు నెలల షెల్టర్ మాత్రమే తనకు దొరికింది. ఆ తరువాత అమ్మమ్మతో కలిసి జీవించడం మొదలుపెట్టింది. కూరలు, పచ్చళ్లను ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటూ బతుకునీడ్చింది. ఆ రోజుల్లో ఒక్కపూట అన్నం దొరకడం అంటే తన దృష్టిలో మహారాణిలా బతికినట్టే. ఎన్నో రాత్రులు తిండి లేకుండానే పడుకున్న రోజులున్నాయి. కన్నబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని కూడా చూసింది. ఆ తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించింది. అలా తన కాళ్ల మీద తను జీవించేంత వరకు చాలా కష్టపడింది. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఏజెంటా మారింది. మెరుగైన జీతం, జీవితం కోసం ఎన్నో ఉద్యోగాలు చేసింది.
కొన్నేళ్ల తరువాత మంచి ఉద్యోగం కోసం కంజిరాంకులం నుంచి వర్కల ప్రాంతానికి వెళ్లిపోయింది. కాని, అక్కడ కూడా నిమ్మరసం, ఐస్ క్రీములే అమ్ముకుని జీవించాల్సి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తు తన దూరపు చుట్టం ఇచ్చిన సలహాతో కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలన్నది తన తండ్రి కల. అది దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది.

 

ఓ నెల పాటు కోచింగ్ తీసుకుని, రోజుకు 20 గంటల పాటు కష్టపడి చదివింది. చివరికి, 2014లో రెండు పరీక్షలు రాసింది. అందులో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయినట్టు అపాయింట్‌మెంట్ కాల్ వచ్చింది. 2016లో కానిస్టేబుల్‌గా అపాయింట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు కానిస్టేబుల్ ఉద్యోగం చేసింది. అయినా సరే ఎస్సై అవ్వాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అదే సమయంలో ఎస్సై పోస్టులు పడడంతో దానికి అప్లై చేసింది. బాగా చదివి, ర్యాంక్ సాధించడంతో 2021, జూన్ 25న వర్కలా పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా అపాయింట్ అయింది. కింద పడిన ప్రతిసారి పది రెట్లు ఎక్కువ కష్టపడడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు చెబుతోంది అన్నీ శివ. తాను సాధించింది ఓ చిన్న విజయమే కావొచ్చు.. కాని, తనలాగా కష్టాలు పడుతున్న వారికి, ఏదో సాధించాలనే తాపత్రయంతో ఉన్న వారికి తన కథే ఒక స్ఫూర్తి అంటోంది శివ.