Flying Hotel: ‘ఎగిరే హోటల్‌’.. ఎక్కితే అంతరిక్షాన్ని, యావత్ ప్రపంచాన్ని చూసేయొచ్చు!!

ఇవన్నీ ఓకే.. కానీ ఎగిరే హోటల్ ? ఇది సాధ్యమయ్యే పని కాదు.. అని భావించే వాళ్ళు కాసేపు ఆగి ఈ వార్త చదవాలి.

  • Written By:
  • Updated On - September 20, 2022 / 10:44 PM IST

భూమిపై హోటల్..
నీటిపై హోటల్..
ఎడారిలో హోటల్..
ఇవన్నీ ఓకే.. కానీ ఎగిరే హోటల్ ? ఇది సాధ్యమయ్యే పని కాదు.. అని భావించే వాళ్ళు కాసేపు ఆగి ఈ వార్త చదవాలి.

యెమెన్‌కు చెందిన ప్రముఖ సైన్స్‌ ఇంజనీర్‌ హషీమ్‌ అల్‌ ఘాయిలీ విభిన్నంగా ఆలోచించాడు.‘ఎగిరే హోటల్‌’ కు సంబంధించిన కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వీడియోను రూపొందించాడు. “స్కై క్రూయిజ్‌” పేరిట దీన్ని యూట్యూబ్‌లో విడుదల చేశాడు. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ డిజైన్ ని నిజమైనదిగా మార్చడానికి అవసరమైన స్కెచ్ కూడా సిద్ధం చేశారండోయ్. పూర్తిగా కృత్రిమ మేధ సాయంతో ఎగిరే ఈ విమానంలో ఒకేసారి 5 వేల మంది అతిథులు ఆకాశయానం చేయొచ్చు. ఇంత భారీ విమానం గాల్లో ఎగిరేందుకు వీలుగా అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లను ప్రత్యేకంగా దీనికోసం డిజైన్‌ చేశారు. ఇందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి అణు రియాక్టర్‌నే ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా అపరిమిత ఇంధనాన్ని ఈ విమానానికి సమకూర్చనున్నారు. దీంతో ఈ విమానం ఎప్పటికీ నేలపై వాలాల్సిన అవసరం రాదని డిజైనర్‌ చెబుతున్నాడు. వేల మంది ప్రయాణికులతో ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలగడం దీని ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పవచ్చు.

అనారోగ్యానికి గురైతే..

“స్కై క్రూయిజ్‌” లో ప్రయాణికులు రోజుల తరబడి ప్రయాణించే అనారోగ్యానికి గురైతే ఎలా? ఈ డౌట్‌ విమానం డిజైనర్‌కు కూడా వచ్చింది. అందుకే ఇందులో ఒక అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కూడా డిజైన్‌ చేశారంట.

ఇలా ఎక్కాలి.. ఇలా దిగాలి..

మరి ప్రయాణికులు “స్కై క్రూయిజ్‌”
లోకి ఎలా ఎక్కి దిగగలరు ? అని అనుకుంటున్నారా!! ఈ నూతన డిజైన్‌ ప్రకారం ప్రయాణికులను లేదా నిత్యావసరాలను సాధారణ వాణిజ్య విమానాలు లేదా ప్రైవేటు జెట్‌ల ద్వారా స్కై క్రూయిజ్‌ చెంతకు చేరుస్తారు. ప్రత్యేకమైన ‘లిఫ్ట్‌’ ద్వారా ప్రైవేటు జెట్‌ నుంచి
ఎగిరే హోటల్‌లోకి ఎక్కిస్తారు. “స్కై క్రూయిజ్‌”కి చేపట్టే మరమ్మతులు సైతం గాల్లోనే నిర్వహిస్తారట!

ఔరా అనిపించే సౌకర్యాలు..

*”స్కై క్రూయిజ్‌” లో భారీ షాపింగ్‌ మాల్, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్‌ సెంటర్లు, ప్లేగ్రౌండ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూళ్లు, వెడ్డింగ్‌ హాళ్లు, సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్‌ చేశారు.

* విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో పైనున్న అంతరిక్షాన్ని, దిగువనున్న యావత్‌ ప్రపంచాన్ని చూడొచ్చు.

* విమానం మధ్య భాగం నుంచి లోపలకు వెలుతురు ప్రసరించేలా పూర్తిగా గ్లాస్‌ బాడీతో దీన్ని డిజైన్‌ చేయనున్నారు.

* విమానానికి ఇరువైపులా ఏర్పాటు చేసే బాల్కనీల తరహా డోమ్‌ల నుంచి అతిథులు చుక్కలను చూసే ఏర్పాటు సైతం ఉంది.

* దట్టమైన మేఘాల్లోంచి ప్రయాణించే సమయంలో విమానం కుదుపులు లేదా కంపనాలకు గురయ్యే అవకాశం ఉంటే దాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి వాటిని నివారించేలా యాంటీ వైబ్రేషన్‌ టెక్నాలజీ సైతం ఈ క్రూయిజ్‌ క్రాఫ్ట్‌లో ఉండనుంది.