70 Yr Old Swimmer: చేతులు కట్టుకొని నదిని ఈదిన 70 ఏళ్ల మహిళ.. ఎందుకంటే?

50, 60 ఏళ్లకే డీలా పడిపోయే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం. కొత్తగా ఆలోచించలేక.. కొత్తగా ఏమీ చేయలేక చతికిల పడిపోతుంటారు.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 05:15 AM IST

50, 60 ఏళ్లకే డీలా పడిపోయే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం. కొత్తగా ఆలోచించలేక.. కొత్తగా ఏమీ చేయలేక చతికిల పడిపోతుంటారు. కానీ అదే వయసున్న కొందరు మాత్రం ఎనర్జిటిక్ గా దూసుకు పోతుంటారు. ట్రెండ్ సెట్టర్లుగా మారుతుంటారు. ఈ కోవలోకే వస్తారు కేరళలోని కొచ్చి నగరానికి చెందిన 70 ఏళ్ల మహిళ ఆరిఫా. రెండు చేతులతో నీటిని పక్కకు నెడుతూ ఈత కొట్టడం ఈజీ. రెండు చేతులనూ కట్టేస్తే!! వామ్మో .. నీళ్లలో మునిగిపోతాం అనుకుంటున్నారా ? 70 ఏళ్ల వయసున్న ఆరిఫా .. మనిషికి సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలడని నిరూపించారు.
ఆమె తన రెండు చేతులూ కట్టుకొని.. 780 మీటర్ల మేర విస్తరించి ఉన్న పెరియార్ నదికి సంబంధించిన కాల్వను విజయవంతంగా ఈదారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఈదడం ప్రారంభించిన వీరు.. 8 గంటల 45 నిమిషాలకు పెరియార్ కాల్వను దాటారు. ఆమెతో పాటు కాల్వను ఈదిన వారిలో 11 ఏళ్ల బాలుడు భరత్ కృష్ణ, 38 ఏళ్ల మహిళ ధన్య కూడా ఉన్నారు. భద్రత రీత్యా… వీరు ఈదేటప్పుడు గజ ఈతగాళ్ళు పక్కనే ఒక పడవలో ఫాలో అయ్యారు. ఈ ముగ్గురూ ఒకే స్విమ్మింగ్ అకాడమీ ( వలస్సెరి రివర్ స్విమ్మింగ్ క్లబ్)
లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలోనే పెరియార్ కాల్వలో ముగ్గురు ఈదారు.

చేతులు కట్టుకొని ఎందుకు?

70 ఏళ్ల ఆరిఫా.. పెరియార్ కాల్వలో చేతులు కట్టుకొని ఈదాల్సిన అవసరం ఏం వచ్చింది ? ఆమె ఎందుకు ఈదారు? ఈ వయసులో ఈత ఎందుకు నేర్చుకున్నారు ? అంటే.. ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంది. “వలస్సెరి రివర్ స్విమ్మింగ్ క్లబ్ లోనే నా పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకున్నాను. నా పిల్లల స్ఫూర్తితో నేను కూడా ఈత నేర్చుకున్నాను. ఏటా ఎంతోమంది ఈత రాక నదుల్లో మునిగి చనిపోతుంటారు. ఈత వస్తే వాళ్ళందరి ప్రాణాలు నిలుస్తాయనేది నా ఆశ. ఎవరైనా.. ఏ వయసు వారైనా ఈత నేర్చుకోగలరు.. చేతులు లేకున్నా ఈత సాధ్యమే అని నిరూపించడానికి నేను ప్రయత్నించాను. అందుకే చేతులు కట్టుకొని ఈదాను” అని ఆరిఫా వివరించారు.

ఇదే పెరియార్ కాల్వలో ఏడాది క్రితం..

ఆరిఫా చేతులు కట్టుకొని ఈదిన ఇదే పెరియార్ కాల్వలో ఏడాది క్రితం(2021లో) పెను విషాదం ఘటన చోటుచేసుకుంది. ఇందులో నుంచి వెళ్తున్న పడవ బోల్తాపడి 77 మంది చనిపోయారు. ఇలాంటి నీటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలంటే ఈత రావాలి. ఈత వచ్చి ఆ 77 మందిలో చాలామంది ప్రాణాలు నిలిచి ఉండేవి. ప్రజలకు ఈత నేర్పే లక్ష్యంతో 2010 సంవత్సరం లో వలస్సెరి రివర్ స్విమ్మింగ్ క్లబ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు అందులో దాదాపు 6 వేల మందికిపైగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఈ జాబితాలో 700 మంది ఆరిఫా లాంటి సీనియర్ సిటిజెన్స్, మరెందరో వికలాంగులు ఉన్నారు.