Hijab row: హిజాబ్ ధ‌రిస్తే.. తిరిగి ఇళ్ళ‌కు వెళ్ళాల్సిందే..!

  • Written By:
  • Publish Date - February 17, 2022 / 04:09 PM IST

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్‌ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో కొంత మంది విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్‌, కలబుర్గిలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చారు.

ఈ క్ర‌మంలో గురువారం ఉడిపిలోని ప్రభుత్వ జి శంకర్ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్‌ను హిజాబ్ తీసేయ‌మ‌ని కాలేజీ అధికారులు చెప్ప‌డంతో 60 మంది విద్యార్ధినులు, తిరిగి ఇళ్ళ‌కు వెళ్ళారు. ఈ క్ర‌మంలో విద్యార్ధినులు మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి కాదని ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌గా, కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ రూపొందించి నిబంధనలు విద్యార్ధులు పాటించాల‌ని, కళాశాల కమిటీ నిర్ణయం మాత్రమే ఇక్కడ వర్తిస్తుందని అధికారులు చెప్పార‌ని ఓ స్టూడెంట్ చెప్పింది. హిజాబ్ త‌మ జీవితాల్లో భాగ‌మైంద‌ని, ఇప్పుడు ఒక్క‌సారిగా తీసేయ‌మంటే, తాము దాన్ని తొల‌గించలేమ‌ని విద్యార్ధినులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

హిజాబ్ ఇష్యూ ముగిసేవ‌ర‌కు త‌మ‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌మ‌ని కాలేజీ అధికారుల‌ను కోరామ‌ని మ‌రో స్టూడెంట్ తెలిపింది. ఈ హిజాబ్ వివాదం పై హైకోర్టు నుండి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు కాలేజీల‌కు వెళ్ళ‌బోయేది లేద‌ని విద్యార్ధినులు తెలిపారు. ఇక‌ కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఉడిపిలో ఉన్న కాలేజీల వ‌ద్ద‌ పోలీసు బలగాలను మోహరించారు. ఈ క్ర‌మంలో ఉడిపి అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్దలింగప్ప మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. అలాగే హిజాబ్‌లను తొలగించేందుకు సిద్ధంగా ఉన్న ముస్లిం విద్యార్థినులను ప్రభుత్వ జి శంకర్ కళాశాలలో తరగతులకు అనుమ‌తించారి సిద్ద‌లింగ‌ప్ప తెలిపారు. ఇక‌పోతే హిజాబ్ వివాదంతో నేటి వరకు సెలవు ప్రకటించిన ఎంజీఎం కళాశాల పరీక్షల నిమిత్తం శుక్రవారం తెరుచుకోనుందని స‌మాచారం.